సరూర్ నగర్ పరువు హత్య కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు

By -  Nellutla Kavitha |  Published on  5 May 2022 3:15 PM GMT
సరూర్ నగర్ పరువు హత్య కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు

సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఎల్బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్. సరూర్ నగర్ పీఎస్ పరిధిలో నిన్న రాత్రి నాగరాజు అనే వ్యక్తి పై ఇద్దరు దుండగులు దాడి చేశారని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసామని తెలిపారు డీసీపి. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా ఇద్దరు హత్య చేసినట్లు గుర్తించామని, నిందితులు ఇద్దరిని ట్రేస్ చేసి పట్టుకున్నామని, ఆ ఇద్దరు నిందితులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ లుగా గుర్తించామని అన్నారు డీసీపి.

ఎల్బీనగర్ డీసీపి చెప్పిన వివరాల ప్రకారం, వికారాబాద్ జిల్లా స్టేషన్ మరపల్లికి చెందిన బిల్లపురం నాగరాజు జనవరిలో మోబిన్ అహ్మద్ సోదరి సుల్తానా అశ్విన్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి సుల్తానా కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవటంతో, నాగరాజు పై కక్ష పెంచుకున్నారు. సుల్తానా ఫ్యామిలీ మెంబర్స్ గత నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారని, నిన్న నాగరాజును ఆయన పనిచేస్తున్న మలక్ పేట మారుతి షోరూం వద్ద మోబిన్ గుర్తించాడని, జనం ఎక్కువగా ఉండటంతో ఇంటికి వెళ్తున్న సమయంలో వెంబడించి హత్య చేశారని తెలిపారు డీసీపి. మోబిన్ తన బంధువు మసూద్ తో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సుల్తానా ను పక్కకు తోసి నాగరాజు తలపై సెంట్రింగ్ రాడ్డు తో దాడి చేసి పారిపోయారని, తీవ్ర రక్తస్రావం తో నాగరాజు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పెళ్లి జరిగినపుడు సుల్తానా తల్లిదండ్రులు బాలానగర్ పీఎస్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే నాగరాజు, సుల్తానా ఇద్దరు మేజర్లు కావడంతో కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు. అయినప్పటికీ ఆగ్రహంతో ఉన్న మోబిన్ హత్య చేశాడని, ఫాస్ట్రాక్ కోర్టు లో ట్రయల్ చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు డీసీపి.

Next Story