న్యూస్ మీటర్ ఎక్స్ క్లూజివ్ - రెగ్యులర్ గెస్టులకు సమన్లు, రక్త పరీక్షలు ఉంటాయన్న పోలీసులు

By -  Nellutla Kavitha |  Published on  5 April 2022 4:20 PM GMT
న్యూస్ మీటర్ ఎక్స్ క్లూజివ్ - రెగ్యులర్ గెస్టులకు సమన్లు, రక్త పరీక్షలు ఉంటాయన్న పోలీసులు

రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఓనర్ వుప్పాల అభిషేక్ తో పాటుగా, మేనేజర్ అనిల్ కుమార్ ను పోలీస్ కస్టడీలోకి తీసుకోవడానికి రేపు కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ పై దాడులు చేసి 72 గంటలు గడిచిన నేపద్యంలో పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు ఉన్నతాధికారులు న్యూస్ మీటర్ తో మాట్లాడారు. ఏప్రిల్ 3న జరిగిన రైడ్స్ తో పాటుగా పలు కీలక విషయాలను వెల్లడించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ పబ్లిక్ వచ్చే కొంత మంది రెగ్యులర్ గెస్ట్ లకు త్వరలోనే సమన్లు జారీ చేయడంతో పాటుగా, రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తామని చెప్పారు పోలీసులు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6 లో ఉన్న రాడిస్సన్ బ్లు హోటల్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బుల్లో 1:40 కి రైడ్స్ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ నిర్వహించిన ఈ దాడిలో పెద్ద మొత్తంలో గెస్టులు ఉండడమే కాకుండా, వారిలో కొంత మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటలకు జరిపిన మెరుపుదాడిలో మొత్తం 140 మంది వ్యక్తులు మద్యపానం సేవిస్తుంటే, ఐదు చిన్న ప్యాకెట్లలో కొకైన్ లాంటి మత్తు పదార్థం లభ్యమైంది. బార్ కౌంటర్లలో ఉన్న స్ట్రాల్లో వీటిని దాచి ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. NDPS act ప్రకారం హోటల్ మేనేజర్ అనిల్ కుమార్, ఓనర్స్ అభిషేక్, అర్జున్ వీరమాచినేని మీద కేసుల్ని బుక్ చేశారు. అయితే ఇందులో అనిల్, అభిషేక్ లను పోలీసులు రిమాండ్కు తరలించారు. అర్జున్ పరారీలో ఉన్నాడు.

ఇక పేరు వెల్లడించడానికి ఇష్టపడని దర్యాప్తు అధికారి తో న్యూస్ మీటర్ మాట్లాడింది. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం.

1. పుడ్డింగ్ అండ్ మింక్ బార్ లోకి వెళ్ళడానికి ఆప్ ద్వారా మాత్రమే ప్రవేశం ఉంటుందని, ఓటిపి వచ్చిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరి పోలీసులు లోపలికి ఎలా వెళ్ళగలరు?

A. మాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఒక నెల పాటు పోలీసులు రెక్కీ నిర్వహించి ఏప్రిల్ 3న మెరుపు దాడి చేశారు. యాజమాన్యం కొంతమంది గెస్ట్ లను మాత్రమే లోపలికి పంపిస్తుంది. బిజినెస్ ఎక్కువగా ఉండే రోజుల్లో కేవలం మెంబర్స్ మాత్రమే లోపలికి వెళ్లగలుగుతారు. బిజినెస్ తక్కువగా ఉండే రోజుల్లో గెస్ట్ తో ఇద్దరు, ముగ్గుర్ని పంపిస్తుంది యాజమాన్యం. పబ్బు లో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్, యాజమాన్యానికి పెరిగిన డబ్బు యావ తోనే వారిని పట్టుకోగలిగారు పోలీసులు.

2 ఈ ఒక్క పబ్ మీదనే రెక్కీ నిర్వహించారా?

A. రాష్ట్రంనుంచి మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమివేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర నుంచి మాకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఆ దిశగా ముఖ్యమంత్రి తో పాటుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేరు వేరుగా పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో సమావేశాలు నిర్వహించారు. పబ్బుల్లో డ్రగ్స్ లేకుండా చూడడానికి ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. ఆ దిశగా ఓనర్స్ తో కూడా సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నగరంలో మొత్తం ఐదు పబ్బుల్లో పోలీసులు రెక్కీ నిర్వహించారు. అవాంఛనీయ శక్తులు పబ్స్ నిర్వహిస్తున్నట్టు గా గుర్తించారు.

3. పోలీసులు కొంతమంది ప్రముఖుల పేర్ల తో పాటుగా నటి నిహారిక కొణిదెల పేరు కూడా జాబితాలో నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకని జాబితాలో నుంచి ఆ పేర్లను తీసేశారు?

A. అదొక లీకైన జాబితా. అలాగే ఖచ్చితమైన జాబితా కూడా కాదు. అదే నిజమైన జాబితా అని కూడా నేను చెప్పను.

4. ఓనరు అభిషేక్ బీజేపీ లీడర్ వుప్పల శారద కుమారుడు, అలాగే కిరణ్ రాజు ఎంపి రేణుకా చౌదరి అల్లుడు. పోలీసులకి వీరి వెనకాల ఉన్న పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా?

A. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను బేస్ చేసుకుని నలుగురి మీద కేసు ఫైల్ చేసాము. మీడియాలో చూసిన తర్వాత మాత్రమే వారి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తెలిసింది. పబ్ 2017 నుంచి కిరణ్ రాజు పేరు మీద ఉన్నట్టుగా అగ్రిమెంట్ ద్వారా తెలిసింది. అనిల్, అభిషేక్ను రిమాండ్కు పంపించారు. ఏప్రిల్ 7న బంజారాహిల్స్ పోలీసులు అయిదు రోజుల విచారణ కోసం పోలీస్ కస్టడీ పిటిషన్ ను ఫైల్ చేస్తారు.

5. ఓనర్ దర్యాప్తుకు సహకరిస్తున్నాడా?

A. లేదు అభిషేకం సహకరించటం లేదు. మేము సేకరించిన డేటా ఆధారంగా పబ్ కి వచ్చే రెగ్యులర్ గెస్టుల హిస్టరీని చెక్ చేస్తున్నాం. దీంతోపాటుగా కొన్ని సాక్షాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపించాం.

షోకాజ్ నోటీసు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ

పుడ్డింగ్ అండ్ మింక్ లైసెన్స్ లను తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. దీంతోపాటుగా లైసెన్స్ లను ఎందుకు క్యాన్సిల్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఫైవ్ స్టార్ హోటల్స్ లో 24 /7 మద్యం సరఫరా చేసేలా స్పెషల్ లైసెన్సులను తీసుకున్నారు. అయితే కొకైన్ కూడా లభించడంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ చట్టాలను పుడ్డింగ్ అండ్ మిల్క్ పబ్ ఉల్లంఘించినట్టు భావిస్తున్నామన్నారు పోలీసులు. షోకాజ్ నోటీసులకు వారిచ్చే వివరణను బట్టి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికైతే సస్పెండ్ చేసినప్పటికీ, క్యాన్సిలేషన్ కు మరొక వారం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. కాశీభట్ట అశోక్ పేరుతో పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్స్ లను తీసుకున్న యాజమాన్యం, ఇందుకోసం 52.66 లక్షల లైసెన్సు ఫీజు, 14 లక్షల టాక్స్ చెల్లించింది.

Next Story