అధిష్టానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి పిలుపు
By Nellutla Kavitha Published on 16 May 2022 3:45 PM GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన మేరకే ఆయన ఢిల్లీకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో రెండు మూడు రోజులపాటు కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారని వినిపిస్తోంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పలువురు సీనియర్ నేతలతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని అధిష్టానం కోరినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుత, గత ఏపీసీసీ చీఫ్ లు అంత ఆక్టివ్ గా లేకపోవటంతో, ఏపీ లో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయిందని నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పటునుంచే దృష్టి పెట్టాలని అధిష్టానం భావిస్తోంది.