రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు
By - Nellutla Kavitha | Published on 5 May 2022 2:20 PM GMTఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించి హాల్ టికెట్లను కూడా విడుదల చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగబోతున్నాయి. తెలంగాణలో రేపటి నుంచి మే 23 వరకు జరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు అంతా ఉదయం 8 గంటల 30 నిమిషాల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించరని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలిపారు. మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 1,443 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. ఇక పరీక్ష కేంద్రాల్లో సిబ్బందిని సెల్‌ఫోన్లతో లోపలికి అనుమతించమని ఉమర్ జలీల్ వెల్లడించారు.
ఇంటర్ పరీక్షల హాల్‌టిక్కెట్లను విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చునని ఏపీ ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. హాల్‌టిక్కెట్లపై కళాశాలల ప్రిన్సిపాళ్ల సంతకాలు అవసరం లేదని, హాజరు శాతం ఉన్న ప్రతీ విద్యార్థీ బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఏటా ఫీజు బకాయిలతో హాల్‌టిక్కెట్లకు లింకు పెడుతున్నాయి. దీంతో కొందరు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకే అధికారులు ఈ చర్యలు తీసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్ లేదా హాల్‌టికెట్ నంబర్‌తో బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. విద్యార్థికి 75 శాతం హాజరు ఉంటేనే హాల్‌టిక్కెట్లు లభిస్తాయని, 60 శాతం వరకు ఉంటే ఫైన్ చెల్లించాలి. 60 శాతం కంటే తక్కువ హాజరుంటే నిబంధనల మేరకు పరీక్ష రాయడానికి అర్హులు కారు.ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9,14,423 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం 1456 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.