హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) నగరం అంతటా సరస్సులు, పార్కులు, ప్రభుత్వ భూములపై ఆక్రమణల వివరాలను తెలిపే కొత్త సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను తీసుకురానుంది. ఈ యాప్ ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలను త్వరగా గుర్తించడంతోపాటు.. అటువంటి ఆక్రమణలపై పౌరులు ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ.. అధికారులు చేపట్టిన తనిఖీలు, చర్యలను ఈ యాప్ ట్రాక్ చేస్తుంది.
నీటిపారుదల, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (NRSA), స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియాతో సహా వివిధ శాఖల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ AV రంగనాథ్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అక్రమ ఆక్రమణల నుండి నీటి వనరులు, పచ్చని ప్రదేశాలను రక్షించే ప్రయత్నాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.చెరువు భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత తర్వాత శిథిలాల తొలగింపుకు హైడ్రా కూడా ప్రాధాన్యత ఇస్తోందని రంగనాథ్ ఉద్ఘాటించారు. మొదటి దశలో సున్నం చెరువు, అప్పచెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్లచెరువు వంటి సరస్సులను సంరక్షించే పనిని అధికారులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.