ఆ విషయంలో.. ప్రపంచ వ్యాప్తంగా 50 నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు

ప్రపంచంలో అత్యంత నిఘా ఉన్న టాప్ 50 నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. నగరంలో చదరపు మైలుకు గణనీయమైన సంఖ్యలో కెమెరాలు ఉన్నాయి.

By అంజి  Published on  25 Sep 2023 8:00 AM GMT
Hyderabad, surveilled cities, World of Statistics, Delhi

ఆ విషయంలో.. ప్రపంచ వ్యాప్తంగా 50 నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు

శతాబ్దాల ఘనమైన వారసత్వం ఉన్న హైదరాబాద్‌ మహానగరం.. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి విశ్వవిఖ్యాత ఐటీ కంపెనీల నుంచి కొత్తతరం ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కంపెనీల వరకూ ఎన్నెన్నో రంగాల పరిశ్రమలకు వేదికగా మారింది. నగరం నలు దిశలా విస్తరిస్తోంది. నగరంలో సమగ్రమైన అభివృద్ధి వ్యూహమే దీనికి కారణం. రోడ్లు, విద్యుత్తు, సెక్యూరిటీ వంటి మౌలిక సదుపాయాలతో దేశంలో హైదరాబాద్‌ ముందు వరుసలో ఉంది. హైదరాబాద్‌ మహానగరం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకుంటున్నది. తాజాగా దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా హైదరాబాద్‌ నిలిచింది.

ప్రపంచంలో అత్యంత నిఘా ఉన్న టాప్ 50 నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. నగరంలో చదరపు మైలుకు గణనీయమైన సంఖ్యలో కెమెరాలు ఉన్నాయి. 'వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' పేరుతో ఎక్స్ హ్యాండిల్ నిర్వహించిన ఈ అధ్యయనంలో, ప్రపంచంలో అత్యధికంగా నిఘా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ 41వ స్థానంలో ఉంది. ఈ అంశంలో లండన్, న్యూయార్క్ వంటి నగరాల కంటే హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. హైదరాబాద్‌ తర్వాతి స్థానాల్లో మాస్కో, న్యూయార్క్‌, మెక్సికో, బ్యాంకాక్‌, లండన్‌, ఢాకా, లాస్‌ ఏంజిల్స్‌, బెర్లిన్‌, జోహెన్స్‌ బర్గ్‌, ప్యారిస్‌, సిడ్నీ, ఇస్తాంబుల్‌ వంటి నగరాలు ఉన్నాయి.

ప్రతి చదరపు మైలుకు సగటున 7462 కెమెరాలతో చైనాలోని షెన్‌జెన్ అత్యధిక నిఘా ఉన్న నగరంగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. విస్తృతమైన కెమెరా నెట్‌వర్క్‌ల ద్వారా భద్రత పట్ల దేశం యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తూ, ఈ జాబితాలోని మొదటి 21 స్థానాల్లో చైనా ఆధిపత్యం చెలాయించింది. ఇక హైదరాబాద్‌లో సగటున చదరపు మైలుకు 321 కెమెరాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఉత్తమ 50 నగరాల్లో భారత్‌ నుంచి ఢిల్లీ 22వ స్థానంలో నిలిచింది. ప్రతి చదరపు మైలుకు 1490 కెమెరాలను కలిగి ఉంది.

వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ సంస్థ.. జనాభా, సీసీ కెమెరాలు, నగర విస్తీర్ణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో మెరుగైన నిఘా కలిగిన నగరాల లిస్ట్‌ను రూపొందించింది. ఈ లిస్ట్‌లో హైదరాబాద్ 41వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ నగరంలో ప్రతి 1.6 చదరపు కిలోమీటర్ల పరిధిలో 321 సీసీ కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నగరం వ్యాప్తంగా సుమారు 5 లక్షల సీసీ కెమెరాలను ఇప్పటివరకు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ, పర్యవేక్షణ, మరమ్మత్తుల కోసం క్యామో విభాగాన్ని ఏర్పాటు చేసి నగరంలో సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Next Story