హైదరాబాద్‌లో మళ్లీ ఫార్ములా ఈ - రేసు
ఫార్ములా ఈ సిరీస్ 2024 సీజన్‌లో హైదరాబాద్ నగరానికి తిరిగి రానుందని నిర్వాహకులు గురువారం ప్రకటించారు.
By అంజి Published on 20 Oct 2023 4:44 AM GMTహైదరాబాద్‌లో మళ్లీ ఫార్ములా ఈ - రేసు
ఫార్ములా ఈ సిరీస్ 2024 సీజన్‌లో హైదరాబాద్ నగరానికి తిరిగి రానుందని నిర్వాహకులు గురువారం ప్రకటించారు. దీంతో భారత్‌లో ఈ-రేసు చుట్టూ ఉన్న ఊహాగానాలకు ముగింపు పలికారు. తాత్కాలిక 2024 క్యాలెండర్‌లో హైదరాబాద్ కనిపించకుండా పోయింది. దీని వలన దేశానికి ఆల్-ఎలక్ట్రిక్ సిరీస్ తిరిగి వస్తుందో లేదో అనే సందేహాలను సృష్టించింది. అయితే, ఈ ఏడాది క్యాలెండర్‌లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న రేసును నిర్వహిస్తుందని నిర్వాహకులు ప్రకటించారు.
ఫార్ములా ఈ రేస్‌కు మళ్లీ ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధమైంది. మెక్సికోలో జనవరి 13న 'సీజన్ 10' కిక్-ఆఫ్ తర్వాత ఫిబ్రవరి 10న హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న ట్రాక్‌లో ఇది జరగనుంది. ఈ విషయం గురంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఎక్స్‌లో తెలిపారు. “ఈ సీజన్‌లో క్రీడా మహోత్సవం యొక్క మెరుగైన సంస్కరణ కోసం సిద్ధంగా ఉండండి” అని రాశారు.
Formula E comes to #Hyderabad yet again - Feb 10, 2024 The racing track remains the same as last year - adjacent to Hussain SaagarGet ready for an enhanced & improved version of sports extravaganza this season @FIAFormulaE @HMDA_Gov pic.twitter.com/UpcG8mpALp
— Arvind Kumar (@arvindkumar_ias) October 20, 2023
"ఈరోజు జరిగిన ఎఫ్‌ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ సీజన్ 10లో హైదరాబాద్, షాంఘై ఆతిథ్య నగరాలుగా ఉన్నాయి" అని ఒక పత్రికా ప్రకటన తెలిపింది. ఫార్ములా ఈ మే 25, 26 తేదీలలో షాంఘై ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో డబుల్-హెడర్ రేసులతో షాంఘైలో మొదటిసారి రేస్ చేస్తుంది. మొట్టమొదటి ఫార్ములా ఈ రేసు సెప్టెంబరు 13, 2014న బీజింగ్‌లో జరిగింది. సాన్యా, హాంకాంగ్‌లు కూడా ఇప్పటి వరకు చైనాలో మొత్తం ఏడు రేసులను నిర్వహించాయి. మార్చి 2019లో చివరిసారిగా రేస్ జరిగింది.
ఫార్ములా ఈ ఇప్పటికే సీజన్ 10 క్యాలెండర్‌తో చరిత్ర సృష్టించింది. టోక్యో మార్చి 30న ఒక రేసును నిర్వహించనుంది. మొదటిసారిగా మోటర్‌స్పోర్ట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసు ఐకానిక్ జపాన్ రాజధాని నడిబొడ్డున వీధుల్లో నిర్వహించబడనుంది.
భారతదేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఇ రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది
ఈ ఏడాది భారతదేశంలోనే మొట్టమొదటి ఫార్ములా ఇ రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. 2023 హైదరాబాద్ ఇ-ప్రిక్స్ నగరంలోని సుందరమైన హుస్సేన్ సాగర్ లేక్‌లో జరిగింది. మొత్తం 18 మలుపులతో కూడిన 2.8-కిమీ ట్రాక్‌ను హుస్సేన్ సాగర్ సరస్సు పక్కన వాహనాల రాకపోకలకు ప్రస్తుతం ఉన్న రోడ్లను ఉపయోగించారు. రేసులో మొత్తం 11 టీమ్‌లు, 22 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. అన్ని కార్లు ఎలక్ట్రిక్, 250kW బ్యాటరీతో నడిచేవి. ఇది 2013లో బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో చివరి ఫార్ములా 1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి FIA వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో ఫార్ములా ఇ రేస్ కారణంగా, ఈవెంట్‌కు రెండ్రోజుల ముందు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయి, దీని ఫలితంగా నగరంలోని వివిధ ప్రదేశాలలో ట్రాఫిక్ జామ్ కావచ్చు. ఈ సంవత్సరం ఫార్ములా E రేసు కారణంగా ఎర్రమంజిల్, KCP, RTA ఆఫీస్, VV విగ్రహం, షాదన్ కాలేజ్, హాంప్‌షైర్ నుండి లక్డికపూల్ మెట్రో స్టేషన్ వైపు ట్రాఫిక్ నెమ్మదిగా ఉంది. నగరం నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఇ రేసులను నిర్వహించిన తీరుపై తెలంగాణ ఎన్‌ఎస్‌యుఐ కూడా నిరసన వ్యక్తం చేసింది. ఫార్ములా ఇ రేస్‌ను దృష్టిలో ఉంచుకుని నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఫార్ములా ఇ రేస్‌కు సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తుందో చూడాలి.