పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోకుండా పాకిస్థాన్‌తో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు ఎలా జరుపుతారు..అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. గతంలో నేను యుద్ధం విరమించాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తే, బీజేపీ నాయకులు నన్ను పాకిస్థాన్ పంపాలని అన్నారు. మరి ఇప్పుడు వారే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను పూర్తిగా మన నియంత్రణలోకి తేకుండానే పాకిస్థాన్‌తో శాంతి చర్చలకు ఎందుకు వెళ్లారు? ఆనాటి వారి లాజిక్ ప్రకారం.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్థాన్ పంపాలా?" అని ఘాటుగా ప్రశ్నించారు. ఇటువంటి ద్వంద్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు.
ఉగ్రవాదం ఎప్పటికీ ప్రమాదకరమైనదేనని నారాయణ స్పష్టం చేశారు. "ఉగ్రవాదులు మానవాళికి పెను ముప్పు. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, చర్యలు చేపట్టాల్సిందే. ఇందులో ఎలాంటి ఉపేక్షకు తావులేదు" అని ఆయన అన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము చెప్పిన విషయాన్ని కొందరు అపార్థం చేసుకుంటున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ విరమణ ఒప్పందాలు, శాంతి చర్చల పురోగతిని తాము స్వాగతిస్తున్నామని నారాయణ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు. "ఉగ్రవాదులపై దాడి చేయాలని మేం స్పష్టంగా చెప్పినప్పటికీ, మా మాటలను వక్రీకరించి, మమ్మల్ని అపార్థం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని నారాయణ తన ఆవేదనను వ్యక్తం చేశారు.