సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం!

హైదరాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా కూల్చివేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  9 Sept 2024 7:00 AM IST
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం!

హైదరాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా కూల్చివేస్తోంది. హైడ్రా తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని దాదాపుగా అందరూ స్వాగతిస్తున్నారు. హైడ్రా వంటి చట్టం తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని పలువురు కోరుకుంటున్నారు. అయితే.. ఏపీ ప్రజలు కూడా హైడ్రాను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం ప్రకటించారు. ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం తీసుకువస్తామని చెప్పారు.

వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగానే హైడ్రా తరహా చట్టంపై కీలక కామెంట్స్ చేశారు. బుడమేరు వాగు పొంగి.. చాలా మంది వరదలో చిక్కుకోవడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం తీసుకువచ్చి, బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలో ఎనిమిదో రోజు కూడా బాధితులు నీటిలోనే ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరద వల్ల పాడైపోయిన వాహనాలను బాగు చేయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరోవైపు ఏపీకి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, వరదల సూచనల నేపథ్యంలో అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. GVMC, పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అల్లూరి జిల్లాకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలున్నాయన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.

Next Story