ఏపీ, తెలంగాణ విద్యార్థులకు షాక్: ఐటీలో కొత్త నియామకాలే లేవే!
ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్లను ప్రారంభించేందుకు అనేక IT కంపెనీలు విముఖత చూపిస్తూ ఉండడంతో విద్యార్థులలోనూ, తల్లిదండ్రుల లోనూ ఆందోళన మొదలైంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Feb 2024 12:45 PM ISTఏపీ, తెలంగాణ విద్యార్థులకు షాక్: ఐటీలో కొత్త నియామకాలే లేవే!
ప్రస్తుతం పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు తలెత్తాయి. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే!! పలు ఐటీ కంపెనీలు కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నాయి. భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఉందా? అవుననే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే. ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్లను ప్రారంభించేందుకు అనేక IT కంపెనీలు విముఖత చూపిస్తూ ఉండడంతో విద్యార్థులలోనూ, తల్లిదండ్రుల లోనూ ఆందోళన మొదలైంది.
ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో అడుగుపెట్టిన యువత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగంతో కాలేజీ నుంచి బయటికి వెళ్లే రోజులు దాదాపుగా పోయాయి. ఈ సంవత్సరం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా కళాశాలలను రిక్రూట్‌మెంట్ కోసం సంప్రదించిన కంపెనీలు చాలా తక్కువే!! దీనితో విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.
విశాఖపట్నంలోని గాయత్రి విద్యా పరిషత్‌లో ప్లేస్‌మెంట్స్ డీన్ డి గిరిధర్ న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, “ఈ సంవత్సరం చాలా ప్రముఖ కంపెనీలు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను ఇవ్వడం లేదు. ప్రధాన కారణం ఏమిటంటే, గత సంవత్సరం ఆఫర్ లెటర్స్ తీసుకున్న వారు ఇప్పటికీ బెంచ్‌లో ఉన్నారు" అని తెలిపారు. “చాలా ఐటీ కంపెనీలు US ప్రాజెక్ట్‌లపై ఆధారపడి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఉత్తీర్ణులైన విద్యార్థులు చాలా మంది నష్టపోతారు. ఉద్యోగాలు పొందిన వారు తక్కువ జీతానికి పని చేయాల్సి వస్తోంది. మాంద్యం పొంచి ఉన్న సమయాల్లో మంచి ఉద్యోగాలు పొందడానికి విద్యార్థులు అసాధారణమైన నైపుణ్యాలను కలిగి ఉండాలి” అని డీన్ గిరిధర్ అన్నారు.
ప్లేస్‌మెంట్ ఆఫీసర్ల ప్రకారం, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఈ సంవత్సరం కొత్తగా నియామకాలు చేయకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. సాధారణంగా భారీ నియామకాలకు వెళ్లే ప్రముఖ ఐటీ కంపెనీలు చాలా కాలేజీల్లో తమ ప్లేస్‌మెంట్ డ్రైవ్ లను ఆపివేశాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ను నమ్ముకున్న చాలా మంది చిక్కుల్లో పడ్డారు. “గత సంవత్సరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సమయంలో నాకు ఉద్యోగం వచ్చింది. అయితే, కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో, నన్ను బెంచ్‌లో ఉంచి, బేసిక్ ప్యాకేజీ ఇచ్చారు. నాలాంటి చాలా మంది ఇప్పుడు మా రెజ్యూమ్‌లను అప్‌డేట్ చేయడానికి కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు’’ అని హైదరాబాద్‌కు చెందిన ఐటీ టెక్కీ ఆదిత్య తెలిపారు.
ఐటీ బూమ్:
గతంలో ఐటీ బూమ్ చాలా మంది యువతను ఆకర్షించింది. మెజారిటీ యువకులు ఐటీ రంగాన్ని ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తక్కువ ప్లేస్‌మెంట్లు ఉండడం యువతలో ఆందోళన రేకెత్తిస్తూ ఉంది.
“చాలా సంవత్సరాలుగా, ఐటిలో పనిచేయడానికి విద్యార్థులపై ఎంతో ఒత్తిడి ఉంది. సుమారు 15 సంవత్సరాల క్రితం, IT బూమ్‌లో ఉంది. విద్యార్థులు అమెరికాలో భారీ జీతాలు ఇచ్చే ఉద్యోగాల వైపు ఆకర్షితులయ్యారు. అదే కొనసాగుతోంది కూడా. ఇప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంజినీరింగ్ చేయాలని, ఉద్యోగం చేసి అమెరికా వెళ్లాలని కోరుకుంటున్నారు" అని హైదరాబాద్‌లోని ఓ కళాశాల ప్రొఫెసర్ రాధ అన్నారు.
విశాఖపట్నానికి చెందిన నాల్గవ సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థి న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, “మేము మా ఫైనల్ పరీక్షలు పూర్తి చేయడానికి ముందే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు ప్రారంభించే వారు. కానీ ఇప్పటివరకు, మేము అలాంటిదేమీ ఏదీ చూడలేదు. విచారకరమైన విషయం ఏమిటంటే, గత సంవత్సరం ఉద్యోగం పొందిన మా సీనియర్లలో చాలా మంది ఇప్పటికీ పని ప్రారంభించడానికి ఎదురు చూస్తూ ఉన్నారు.
నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకునే సమయం
దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 40 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. సాధారణంగా ఒక సంస్థ 100 మంది విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటుంది.. అయితే ఇటీవలి రిక్రూట్‌మెంట్‌లలో, 30 మంది విద్యార్థులను మాత్రమే తీసుకున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. “మంచి సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారిని మాత్రమే నియమించుకుంటున్నారు. ఇంతకుముందు సగటు విద్యార్థి కూడా సులభంగా ఉద్యోగం పొందగలిగే వాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకోవాలి, ”అన్నారాయన.
ఉద్యోగాల కోత:
2024లో, గూగుల్ తన వర్క్‌ఫోర్స్ నుండి 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. మైక్రోసాఫ్ట్ 1,900 ఉద్యోగులను తొలగించింది. Layoffs.fyi నుండి ఇటీవలి డేటా ప్రకారం, 104 టెక్ కంపెనీలు 2024లో దాదాపు 28,970 మంది ఉద్యోగులను తొలగించాయి. పాండమిక్ ఓవర్ హైరింగ్, ఆర్థిక మాంద్యాన్ని కంపెనీలు కారణాలుగా చూపిస్తూ ఉన్నాయి.