మహారాష్ట్ర లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి BRS
మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 7:39 AM IST
మహారాష్ట్ర లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి BRS
జాతీయ రాజకీయాల్లో తమ పాత్ర పోషించాలని.. దేశ రాజకీయాల్లో మరిన్ని మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో స్థానిక పార్టీ నాయకులను కలిశారు. కొన్నాళ్ల ముందు థర్డ్ ఫ్రంట్ పేరుతో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్‌ను ఢీకొడతామని చెప్పారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. అధికారం కోల్పోవడమే కాదు.. అనుకున్నదాని కంటే సీట్లు తక్కువ వచ్చాయి. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ నుంచి ఫోకస్ కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే.. తాజాగా మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కీలక ప్రకటన చేసింది.
మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో రైతులు, పేదలు, దళితుల కోసం పార్టీ పనిచేస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్రతలు, పదాధికారులు పార్టీ విజయానికి, అంకిత భావంతో పనిచేస్తున్నట్లు శంకరన్న దోండ్గే వివరించారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో పెద్దఎత్తున జాయిన్ అవుతున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పనిచేస్తుందన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలను రద్దు చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేయాలని పార్టీ నాయకులకు కేటీఆర్ సూచించారు. ఆయా పథకాలను రద్దు చేయకుండా లబ్ధిదారుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీర్ చెప్పారు.