కేసీఆర్ పాలన అంతమయ్యేదాకా యాత్ర ఆగదు - బండి సంజయ్
By - Nellutla Kavitha | Published on 14 April 2022 3:30 PM GMTఅలంపూర్ జోగులాంబ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ పాలనను తరిమి తరిమి కొట్టేందుకే ప్రజా సంగ్రామ యాత్రను చేస్తున్నట్టుగా ప్రకటించారు. జోగులాంబ తల్లికి అధికారికంగా ఉత్సవాలు ఎందుకు చేయట్లేదని, తను చేసిన పాపమేందని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఘనంగా ఉత్సవాలు నిర్వహంచడంతోపాటుగా, అయ్యప్ప, శివ, హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు చేసుకునేలా జీవోలిస్తామని అన్నారు సంజయ్.
KCR పైసల సంచులు పట్టుకుని రాష్ట్రాలు తిరగడం కాదు, జనంలోకి రావాలని, రేపటి నుండి కేసీఆర్ భాగోతాన్ని బయటపెడతానన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనను తరిమికొట్టేదాకా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ప్రతి గడప గడపకూ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడంతోపాటు కేసీఆర్ అరాచక, నయా నిజాం పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి చైతన్యం చేస్తామన్నారు. బీజేపీ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకుని అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించారు.
ఈ సమావేశానికి బండి సంజయ్ తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, గరికపాటి రామ్మోహన్ రావు సహా పలువురు సీనియర్ నేతలు, రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు.
కేసీఆర్ కు మైనారిటీలంటే భయమని, ఆయనను వదిలిపెట్టనని అన్నారు సంజయ్. 15 నిమిషాలు సమయమిస్తే, దేశంలోని హిందువులందరినీ చంపుతానన్న ఎంఐఎం నేతపై సాక్షాధారాలను ప్రభుత్వం సమర్పించకపోవడంవల్లే కోర్ట్ కేసు కొట్టేసిందని, అయినా ఎంఐఎం నేతను వదిలిపెట్టే ప్రసక్తేలేదు,కేసులు తిరగదోడుతాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్శించుకున్న స్థలం నుంచే రెండో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' కూడా స్టార్ట్ చేస్తున్నం అన్నారు బండి.