ఇస్రో ఖాతాలో మరో విజయం.. స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్‌

వరుస విజయాలతో జోరు మీదున్న ఇస్రో.. తన ఖాతాలో మరో చరిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

By Knakam Karthik  Published on  16 Jan 2025 11:22 AM IST
INDIA, ISRO, SPADEX SUCCESS

ఇస్రో ఖాతాలో మరో విజయం.. స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్‌

వరుస విజయాలతో జోరు మీదున్న ఇస్రో.. తన ఖాతాలో మరో చరిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది. గత కొన్నేళ్లుగా అంతరిక్షంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా 2025 ఏడాదిలో తొలి గెలుపును అందుకుంది. గతేడాది చివర్లో నింగిలోకి పంపించిన స్పేడెక్స్ ప్రయోగానికి సంబంధించిన డాకింగ్ ప్రక్రియను సక్సెస్‌ఫుల్‌గా ఇస్రో పూర్తి చేసింది. ఈ స్పేస్ డాకింగ్ సక్సెస్ అయినట్లు ఇస్రో ట్వీట్ చేసింది.

ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. ఇక అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానం చేయడం చాలా క్లిష్టమైన పని కాగా.. ఇప్పటివరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే.. ఈ ఘనతను సాధించాయి. తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

గతేడాది డిసెంబర్ 30వ తేదీన తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్సేస్ సెంటర్(షార్)లో నుంయి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ 60 (పీఎస్‌ఎల్‌వీ)లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్‌-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్‌-1ఎ రాకెట్‌ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్‌ (Docking) కోసం మూడుసార్లు ప్రయత్నించగా.. పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది.

ఫైనల్‌గా గురువారం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ శాటిలైట్లను హోల్డ్ చేసిన డాకింగ్‌ను మొదలుపెట్టారు. ఇది సక్సెస్ ఫుల్ అయినట్లు ఇస్రో తన ఎక్స్ అకౌంట్‌లో రాసుకొచ్చింది. దీని కోసం శ్రమింయచిన టెక్నికల్ టీమ్‌, యావత భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా టెక్నాలజీలో భారత్ కూడా వాటి సరసన చేరింది.

Next Story