32 జిల్లాల్లో కొత్తగా జిల్లా, సెషన్స్ కోర్టులు ప్రారంభించిన సీజె, సీయం
CJ And CM Inaugurated New District Courts In Telangana
By - Nellutla Kavitha | Published on 2 Jun 2022 7:42 PM ISTతెలంగాణ రాష్ట్రంలోని 32 జుడిషియల్ జిల్లాల్లో కొత్తగా జిల్లా, సెషన్స్ కోర్టులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. హైకోర్టు ప్రాంగణం నుంచి 23 కొత్త జిల్లాల జుడిషియల్ కోర్టులను వర్చువల్ విధానంలో సిఎంతో కలిసి ప్రారంభించారు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ.
ప్రజలకు చేరువగా న్యాయ వ్యవస్థ ఉండాలని రాజ్యాంగం చెప్పిన విధానానికి అనుగుణంగా ఈరోజు 32 జిల్లాల న్యాయ సమాహారాన్ని ప్రారంభిస్తున్నామని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని వేళలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని కేసీఆర్ ప్రకటించారు. పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంటే న్యాయం వేగంగా జరుగుతుందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. పని భారం ఎక్కువగా ఉన్న కోర్టులను విభజిస్తే ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని కెసిఆర్ అన్నారు.
న్యాయ వికేంద్రీకరణలో తెలంగాణ అడుగు ముందుకేసిందని, రాష్ట్ర అభివృద్ధిలో న్యాయశాఖ అభివృద్ధి కూడా కీలకమని గుర్తించిన కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. 13 జుడిషియల్ యూనిట్లు 35 జుడిషియల్ యూనిట్లుగా మరుతున్వాయని, దేశంలో ఈ స్థాయిలో న్యాయ వికేంద్రీకరణ జరగడం ఇదే మొదటిసారి అంటూ అభినందనలు తెలిపారు ఎన్.వి.రమణ. ఎనిమిదేళ్ల క్రితం కొత్త రాష్ట్ర భవిష్యత్తు మీద ఎన్నో అనుమానాలు ఉండేవని, అయితే రాష్ట్ర అభివృద్ధి ఆ అనుమానాల్ని పటాపంచలు చేసిందని అన్నారు ఎన్.వి.రమణ.