కాంగ్రెస్ లో చేరిన TRS మేయర్ : రాహుల్ సమక్షంలో జాయిన్
TRS Leader Joins Congress Party In The Presence Of Rahul Gandhi
By - Nellutla Kavitha | Published on 4 July 2022 3:56 PM GMTనేతల వలసల పర్వం కొనసాగుతోంది. ఇటీవలే బీజేపీ కార్పోరేటర్లు టీఆరెస్ లో చేరితే, టీఆరెస్ కార్పోరేటర్లు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా బడంగ్‌పేట్ మేయర్ పారిజాత, పలువురు తెరాస నేతలు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌ను కీలక నగరంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామంటున్న తెరాస నేతలు, కనీసం రోడ్లపై పడ్డ గుంతలు పూడ్చటం లేదని మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్, డీజిల్, పెట్రోల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా పెంచారని, సామాన్య ప్రజలకు బతకడమే భారంగా మారిందని అన్నారు. దేశ సరిహద్దుల్లో రక్షణ లేకుండా పోయిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అప్పులపాలైందని అన్నారు రేవంత్.
అభివృద్ధి కుంటుపడటమే కాకుండా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి చేరిందని, ఈ అంశాలన్నింటిపైనా రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉండాలని రాహుల్‌గాంధీ సూచించారని, తెలంగాణను ఇచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా తమపై ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు