గణతంత్ర వేడుకలను నిర్వహించాల్సిందే - తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
Republic Day Celebrations And Parade Should Be Held In Telangana Says HighCourt
By - Nellutla Kavitha | Published on 25 Jan 2023 11:56 AM GMTగణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించా ల్సిన హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం జారీ చేసిన ఆదేశాల మేరకు గణతంత్ర వేడుకలను జరపాలని ఆదేశించింది. తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. హైదరాబాదుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపింది ఉన్నత న్యాయస్థానం. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని అందులో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ పంపించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించడంపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ కేసును మధ్యాహ్నం 2.30 గంటలకు జస్టిస్ మాధవి ధర్మాసనం విచారణ జరిపింది.
రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున గణతంత్ర వేడుకలు జరపడం లేదన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదనను తోసి పుచ్చింది హైకోర్టు. ఈ వేడుకలలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని, వారిని అనుమతించాలని ఆదేశించింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్ సందర్భంగా వాదనలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా పరేడ్ గ్రౌండ్‌లో ప్రభుత్వం వేడుకలు నిర్వహించలేదని, రాష్ట్రంలో కోవిడ్ ఉన్న నేపథ్యంలో రాజభవన్ లోనే గణతంత్ర వేడుకలు జరుపుకోవాలని జనవరి 13వ తేదీనే లేఖ రాశామని ఏజీ వివరించారు. రాజభవన్ లో గవర్నర్ అధ్యక్షతన జరిగే వేడుకలకు అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతారని హైకోర్టుకి ఏజీ వివరించారు. ఇక రాజ్ భవన్ లో జరిగే గణతంత్ర వేడుకలను ప్రజలు చూసేందుకు వీలుగా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై 19వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాలను రాష్ట్రాలు పాటించాలని సూచించింది కేంద్రం. అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా రాష్ట్రంలో కరోనా ఉన్నట్టయితే కోవిడ్ ఆంక్షలు ఎక్కడున్నాయో చూపించాలని ధర్మాసనం ప్రశ్నించింది. కోవిడ్ ప్రోటోకాల్ జీవో సమర్పించలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
గణతంత్ర దినోత్సవం దేశభక్తిని చూపించే జాతీయ పండుగ అని, గణతంత్ర స్ఫూర్తిని చాటేలా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. దీనితోపాటు పరేడ్ కూడా నిర్వహించాలని ఆదేశించింది. అయితే పరేడ్ ఎక్కడ నిర్వహించాలన్నది ప్రభుత్వ ఇష్టమని చెప్పింది ఉన్నత న్యాయస్థానం. రిపబ్లిక్ డే వేడుకలు జరపాల్సిందేనని, దేశవ్యాప్తంగా 1950 నుంచి జనవరి 26 వేడుకలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది.
అంతకుముందు రిపబ్లిక్ డే వేడుకల విషయంలో గవర్నర్ తమిళిసై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య గత కొంతకాలంగా ఉన్న విభేదాలకు తోడు గణతంత్ర దినోత్సవం వివాదం కూడా జతకలిసింది. గతేడాదిలాగే ఈసారి కూడా రాజ్ భవన్ లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం రాజ్ భవన్ అధికారులకు లేఖ రాసింది. దానికి సిఎస్, డిజిపి ఇతర ఉన్నత అధికారులు హాజరవుతారని పేర్కొంది. అయితే గతేడాది కరోనా కారణంగా రాజభవన్ లో వేడుకలు జరిగాయని ఈసారి మాత్రం ఎందుకు సాదాసీదాగా జరపాల్సిన అవసరం ఉందని ప్రశ్నించిన గవర్నర్ తమిళిసై ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
ఇక హైకోర్టు తీర్పు కంటే ముందే ఈ విషయంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పందించారు. గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించిన గులాబీ నేతలు గణతంత్ర వేడుకలు ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసునని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన ప్రోటోకాల్ రిపబ్లిక్‌డే విషయంలో పాటిస్తున్నామని, గవర్నర్‌కు బీజేపీ ప్రోటోకాల్ కావాలంటే ఏమి చేయలేమన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఏనాడూ గవర్నర్ తమిళిసై గురించి మాట్లాడలేదని కానీ గవర్నరే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇక బహిరంగ సభలకు లేని కోవిడ్ వ్యాప్తి గణతంత్ర దినోత్సవ వేడుకలకే ఎందుకు గుర్తుకు వచ్చిందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఖమ్మం బహిరంగ సభకు వివిధ రాష్ట్రాల సీయంలు వచ్చారని, అప్పుడు కోవిడ్ ప్రోటాకాల్ లేదా అని, కోర్టు కలుగజేసుకుంటే తప్ప ప్రభుత్వం చలించదా అని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ప్రశ్నించారు.
హైకోర్ట్ ఆదేశాలను ఆహ్వానించిన కాంగ్రెస్
రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్ ఆహ్వానించారు. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరుగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలి. సంప్రదాయం ప్రకారం సిఎం రిపబ్లిక్ డే ఉత్సవాలకు హాజరై హుందా గా వ్యవహరించాలని అన్నారు. గవర్నర్, సీఎంలు రాజకీయాలు ప్రక్కన పెట్టి, పరస్పరం గౌరవించుకుని ప్రజలకు మార్గదర్శకులు కావాలని కోరారు.