లాడ్ బజార్ గాజులకు భౌగోళిక గుర్తింపు

Geographical Indicator For Laad Bazar Bangles

By -  Nellutla Kavitha |  Published on  24 Jun 2022 7:35 AM GMT
లాడ్ బజార్ గాజులకు భౌగోళిక గుర్తింపు

హైదరాబాదీ హలీం, వరంగల్ దర్రీలు నిర్మల్ చెక్క బొమ్మలు, కరీంనగర్ ఫిలిగ్రీ, పోచంపల్లి ఇక్కత్ ఇవన్నీ మనకు మాత్రమే సొంతమైన మన అద్భుతమైన కళారూపాలు. తెలంగాణకే పరిమితమైన ప్రత్యేక ఉత్పత్తులు. వీటన్నిటికీ మరో విశిష్టత కూడా ఉంది, అదే భౌగోళిక గుర్తింపు. వీటి సరసన ఇప్పుడు లాడ్ బజార్ గాజులు కూడా నిలుస్తున్నాయి. తాజాగా లాడ్ బజార్ గాజులకు కూడా భౌగోళిక గుర్తింపు లభించింది.

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన వారు ఖచ్చితంగా చార్మినార్ ను చూసి తీరాల్సిందే. చార్మినార్ సందర్శించిన వారిని వెంటనే ఆ పక్కనే ఉన్న లాడ్ బజార్ లో ఉన్న రంగు రంగుల గాజులు ఆకర్షిస్తూనే ఉంటాయి. చూపులు తిప్పుకోనివ్వని అందం వాటి సొంతం. లాడ్ అంటే లక్క అని అర్థం. అక్కడ మాత్రమే తయారవుతాయి కాబట్టి ఆ ప్రాంతానికి లాడ్ బజార్ గా పేరు వచ్చింది. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లాడ్ బజార్ గాజులకు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. మనకు మాత్రమే ప్రత్యేకమైన లాడ్ బజార్ గాజుల భోగోళిక గుర్తింపు కోసం చేసిన దరఖాస్తును చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయం గురువారం ఆమోదించింది.

లక్కను ఉపయోగించి గాజులు తయారు చేయడం దాదాపు 500 ఏళ్ళ క్రితం, మొఘలుల కాలంలోనే ఇక్కడ ప్రారంభమైనట్టు చారిత్రక ఆధారాలను రిజిస్ట్రీకి సమర్పించారు. లక్క తో పాటుగా రంగురంగుల గాజు అద్దాలను, బీడ్స్ తో పాటు పొదిగి, అద్భుతమైన పనితనంతో, సుందరమైన డిజైన్లతో తీర్చిదిద్దడం లాడ్ బజార్ గాజుల ప్రత్యేకత. లాడ్ బజార్ లో వేలాది కుటుంబాలకు, తరతరాలుగా ఇదే జీవనాధారంగా కొనసాగుతూ వస్తోంది. ప్రత్యేకమైన నైపుణ్యంతో, అతి సూక్ష్మమైన పనితనంతో ఉండే ఈ గాజులు ప్రపంచంలో మరెక్కడా లేవని దరఖాస్తులో పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన క్రెసెంట్ హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిసన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసింది.

మిగతా అన్ని రంగాల లాగే కోవిడ్ ప్రభావం కూడా గాజుల తయారీదారుల మీద కూడా పడింది. ఇప్పుడు భౌగోళిక గుర్తింపు ద్వారా గాజుల తయారీ దారుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని భావిస్తున్నారు. జిఐ గుర్తింపుతో మరింత మందికి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నారు. త్వరలోనే జీఐ కార్యాలయం బృందం లాడ్బజార్ ప్రాంతాన్ని సందర్శించి గుర్తింపుపై అధికారిక పర్యటన చేయనుంది. భౌగోళిక గుర్తింపు రానుండడంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు లక్క గాజుల కోసం ప్రత్యేకంగా ఒక లోగోను కూడా తయారు చేశారు.

Next Story