టాలీవుడ్ లో రేపటినుండి షూటింగ్స్ - చర్చలు సఫలం
Telugu Film Shootings To Start Again From Tomorrow
By - Nellutla Kavitha | Published on 23 Jun 2022 5:08 PM ISTరెండురోజులుగా ఆగిన తెలుగు సినిమా షూటింగ్స్ మళ్లీ మెదలుకాహోతున్నాయి. టాలీవుడ్ లో రెండు రోజులుగా సినీ కార్మికుల వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కి వస్తామని సమ్మెకు దిగారు. మరోవైపు సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరైతేనే వేతనాల పెంపు గురించి ఆలోచిస్తామని ఫిల్మ్ ఛాంబర్ కూడా ఖరాకండీగా ప్రకటించింది. దాంతో దాదాపు 28కి పైగా చిత్రాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలం అవ్వడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
ఈ చర్చల్లో వేతనాలు పెంచేందుకు నిర్మాతలు, షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సినీ కార్మికులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్మికుల వేతనాల పెంపు కోసం నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రేపు జీతాల పెంపు విషయమై నిర్మాతలందరితో చర్చలు జరిపి విధివిధానాలను ప్రకటిస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలపారు. చర్చలు సఫలం అవడంతో రేపటి నుండి యథావిధిగా సినిమా షూటింగ్స్ జరుగుతాయని, పెరిగిన జీతాలు రేపటి నుండే అమలులోకి వస్తాయని ఫిల్మ్ ఫెడరేషన్ పెద్దలు ప్రకటించారు.
తలసానితో మీటింగ్ అనంతరం ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశాయి. ప్రెస్ మీట్ లో నిర్మాతల మండలి అధ్యక్షుడు నిర్మాత సి కల్యాణ్ మాట్లాడారు. మంత్రి తలసాని చొరవతో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, సుధీర్ఘ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ద్వారా రేపటి నుంచి యధావిధిగా చిత్రీకరణలు జరుగుతాయని ప్రకటించారు. వేతనాల కోసం రేపు కో ఆర్డినేషన్ కమిటీ వేసి దాని ఆధ్వర్యంలో ఛాంబర్, ఫెడరేషన్ కలిసి డిసైడ్ చేసి ఆమోదిస్తుందని అన్నారు. విధివిదానాలను దిల్ రాజు చైర్మన్ గా ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటి ద్వారా నిర్ణయిస్తాము అని తెలిపారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, సమావేశంలో అన్ని విషయాలపై మాట్లాడుకున్నామని, వేతనాలు పెంపుకు నిర్మాతలు సిద్దమయ్యారని, రేపటి నుంచి కార్మికులు చిత్రీకరణలకు వెళతారని అన్నారు. అన్ని సమస్యలను కోఆర్డినేషన్ కమిటీ ద్వారా సాల్వ్ చేసుకుంటామని తెలిపారు. ఇక రేపటి నుంచి యధాతధంగా షూటింగ్స్ జరగనున్నాయి.
అయితే 10 పర్సెంట్ పెంచేందుకు నిర్మాతలు సిద్ధమయితే, కాదు కనీసం 30పర్సెంట్ అయిన పెంచాలి అని ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. రేపు జరిగే సమన్వయ కమిటీ భేటీ లో దీనిపై తుది నిర్ణయం సమన్వయ కమిటీ చైర్మన్ గా దిల్ రాజు తీసుకోనున్నారు.