మోదీ ఆధ్వర్యంలో దేశంలో మరో 20 ఏళ్ల బీజేపీ పాలన - బండి సంజయ్
Bandi Sanjay On Telangana Formation Day
By - Nellutla Kavitha |
తెలంగాణ ప్రజలారా, ఇంకెన్నాళ్లు భయపడతారు? ఇకనైనా మేల్కొండి, బీజేపీ సాగిస్తున్న మహోద్యమంలో భాగస్వాములు కండి అని పిలుపునిచ్చారు బండి సంజయ్. శ్రీలంక తరహాలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనతో తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితి ఏర్పడిందని, రైతులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులుసహా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆయన వరంగల్ లో తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్ష సాధన సభలో అన్నారు.
కేసీఆర్ చేసిన ద్రోహం, మోసాలపై బీజేపీ సాగిస్తున్న మహోద్యమంలో భాగస్వాములు కావాలని, పేదల ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో మరో 20 ఏళ్లు దేశంలో బీజేపి అధికారంలో ఉండటం ఖాయమని, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే అమర వీరుల కుటుంబాలకు తగిన గౌరవం కల్పిస్తుందని, సెక్రటేరియట్ లో అమర వీరుల స్థూపం నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సెక్రటేరియట్ సహా జిల్లా కేంద్రాల్లోనూ అంబేద్కర్, పూలే విగ్రహాలను ఏర్పాటు చేస్తామని, అమరుల యాదిలో, ఉద్యమకారుల ఆకాంక్షల సాధన సభలో బండి సంజయ్ వరంగల్ లో పాల్గొని ప్రసంగించారు.