గవర్నమెంటు వర్సెస్ గవర్నర్ : సయోధ్య కుదిరినట్టేనా?!

Government vs Governor: Is everything patched up?!

By -  Nellutla Kavitha |  Published on  3 Feb 2023 7:46 PM IST
గవర్నమెంటు వర్సెస్ గవర్నర్ : సయోధ్య కుదిరినట్టేనా?!

తెలంగాణ గవర్నమెంట్ కి గవర్నర్ కి మధ్య సయోధ్య కుదిరిపోయిందా? ప్రగతి భవన్ కి రాజ్ భవన్ కి మధ్య ఉన్న గ్యాప్ తగ్గిపోయిందా? గవర్నర్ సడన్ గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? బయట పులిలా మాట్లాడే గవర్నర్ ఈరోజు అసెంబ్లీలో పిల్లిలా ఎందుకు మారిపోయారు? బీఆర్ఎస్ కి గవర్నర్ బి టీంలా తయారయ్యారా? ఇవీ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన సందేహాలు.

ఏడాదికి పైగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య కొనసాగిన మాటల యుద్ధం, ప్రోటోకాల్ వివాదం, రాజకీయ ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య, కోర్టు జోక్యంతో బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడానికి ప్రభుత్వం గవర్నర్ ను ఆహ్వానించింది. “పుట్టుక నీది, చావు నీది…బతుకంతా దేశానిది” అంటూ కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్‌ తమిళిసై. “కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో…పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో” అనే శ్రీ దాశరధి కృష్ణమాచారి కవనంతో ముగిస్తూ జయ జయహే తెలంగాణ, జై తెలంగాణ, జై హింద్ నినాదాలు చేశారు గవర్నర్.

ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు గవర్నర్ చేసిన ప్రసంగంలో ఎనిమిదేళ్ల తెలంగాణ సాధించిన ప్రగతి గురించి చెబుతూ నా ప్రభుత్వం అంటూ ఒక్కో అంశం గురించి వివరించారు గవర్నర్ తమిళసై సౌందర రాజన్. సరిగ్గా వారం రోజుల క్రితం గణతంత్ర దినోత్సవం రోజున రాజభవన్ లో అభివృద్ధి అంటే భవన నిర్మాణాలు కాదు, జాతి నిర్మాణం అంటూ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించిన గవర్నర్, ఈరోజు మాత్రం తెలంగాణ రాష్ట్ర పరిపాలనా ప్రతిపత్తికి సంకేతంగా నా ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు సభాముఖంగా హృదయపూర్వకంగా అభినందనలు అంటూ ప్రసంగించారు. ప్రసంగంలో ఎక్కడా కేంద్రం వివక్ష చూపిస్తోందని కానీ, కేంద్రం అనుసరిస్తున్న విధానాల గురించి కానీ, ఏ ఒక్క రాజకీయ విమర్శ లేకుండా ప్రభుత్వం ప్రసంగ కాపీని గవర్నర్ కు అందజేసింది. అదే ప్రసంగాన్ని యధాతధంగా చదివేశారు గవర్నర్.

గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానిస్తోందని, తనకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ మర్యాదలు అందివ్వట్లేదంటూ తెలంగాణలోనే కాకుండా పుదుచ్చేరిలో కూడా విలేకరుల సమావేశంలో తన అసహనాన్ని వెళ్ళగక్కారు గవర్నర్. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా వివరించినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఉగాది రోజున దర్శనానికి వెళితే ప్రోటోకాల్ ప్రకారం తనకు స్వాగతం పలకడానికి, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు రాలేదని, ప్రోటోకాల్ పాటించలేదని గవర్నర్ విమర్శించారు. అయితే ఈరోజు అసెంబ్లీలో ప్రసంగానికి ముందు యాదాద్రి దేవాలయానికి దర్శనానికి వెళ్లారు గవర్నర్. అక్కడ ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. దీంతో పాటుగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ కు సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. దాదాపుగా 40 నిమిషాల పాటు కొనసాగిన గవర్నర్ ప్రసంగంలో విద్యుత్తు, సాగు, తాగునీరు, పెట్టుబడులు, ప్రాజెక్టులు, రైతుబంధు, దళిత బంధు, యాదాద్రి పునర్నిర్మాణం, కొత్త సచివాలయం గురించి వివరించారు.

అయితే ఈ ప్రసంగం పై మాత్రం అటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సడన్ గా గవర్నర్ యూటర్న్ ఎందుకు తీసుకున్నారని, డబుల్ బెడ్ రూముల ప్రస్తావన ఎందుకు లేదని, బయట పులిలా మాట్లాడిన గవర్నర్ సభలో పిల్లిలా ఎందుకు మారిపోయారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. సీఎం కేసీఆర్ కు, గవర్నర్ తమిళిసైకు మధ్య రాజీ కుదిరిందని, సీఎం డైరెక్షన్లోనే గవర్నర్ నడిచారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్ తో చెప్పించారని, ధరణి గురించి ఎందుకు ప్రస్తావించలేదని, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారని బిజెపి ప్రశ్నిస్తోంది. గవర్నర్ ప్రసంగంలో ఎన్నో అబద్ధాలు ఉన్నాయని, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని బిజెపి ఆరోపిస్తోంది.

మరి ప్రోటోకాల్ వివాదం, ఇద్దరి మధ్య పెరిగిన గ్యాప్ ఈరోజు నుంచి తగ్గిపోయినట్టేనా? విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా సయోధ్య కుదిరిందా? అంతా సమసిపోయిందా? పెండింగ్ లో ఉన్న బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపుతారా? పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బి ఆర్ ఎస్, తెలంగాణలో మాత్రం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించింది. రెండేళ్ల తర్వాత గవర్నర్, అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం కేవలం, కోర్టు జోక్యం చేసుకున్నందువల్ల మాత్రమేనా? రేపటి నుంచి రాజకీయం ఎలా ఉండబోతోంది?పరిస్థితులు మారతాయా?

Next Story