రైతులు చట్టసభల్లోకి రావాలి - సీఎం కేసీఆర్

Odisha Former CM Giridhar Gamang Joins BRS Party

By -  Nellutla Kavitha |  Published on  27 Jan 2023 2:07 PM GMT
రైతులు చట్టసభల్లోకి రావాలి - సీఎం కేసీఆర్

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర అభివృద్ధి చెప్పుకోదగ్గట్టుగా జరగలేదని అన్నారు సీఎం కేసీఆర్. అమెరికా, చైనా దేశాల కంటే మన దగ్గర సంపద ఎక్కువ ఉన్నప్పటికీ, భారతదేశ కథ మాత్రం ఇంకోలాగా ఉందని అన్నారు కేసీఆర్. మన తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు కూడా మనకంటే వేగంగా అభివృద్ధి చెందాయని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పార్టీలు, నేతలు కాకుండా ప్రజలే గెలవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. దాన్నే సరైన ప్రజాస్వామ్యంగా భావించవలసిన అవసరం ఉందన్నారు.

దేశంలో ఇప్పటికే ఎన్నో రంగుల జెండాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం చూశామని, కానీ రైతులు పేదల పరిస్థితి మాత్రం మారలేదన్నారు. ఒడిశాలో ఉన్న మహానది నీళ్లను 25 శాతం మాత్రమే వాడుకుంటున్నామని, మిగతా నీరంతా సముద్రం పాలవుతోందని, ప్రజలకు సరైన మంచి నీరు కూడా ఇవ్వలేకపోవడం ప్రస్తుతం మనదేశంలో ఉన్న దుస్థితికి అద్దం పడుతుందన్నారు సీఎం కేసీఆర్. దేశంలో రైతులు ఆందోళన చేస్తే వారి సమస్యకు కేంద్రం ఎలాంటి పరిష్కారం చూపించలేదని అన్నారు.

జాతి, ధర్మం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని, ఏదైనా చేసి, ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతోనే, ఎన్నికల్లో పార్టీలు ముందుకు వెళ్తున్నాయని అన్నారు. అందుకే ఈసారి అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో తాము ఎన్నికల్లో వెళ్తున్నామని సీఎం కేసీఆర్ నినదించారు. రైతుకు హలం పట్టడమే కాదని కలం పట్టడం కూడా రావాలని, రైతులు చట్టసభల్లోకి రావాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. తెలంగాణలో వలసపోయిన రైతుల తిరిగి వస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైంది దేశంలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు కేసీఆర్. కిసాన్ బంధు, దళిత బందు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, అందుకు కావాల్సింది ధన్ కి బాత్ కాదని మన్ కి బాత్ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేని సహజ వనరులు మన దగ్గర ఉన్నాయని, అందరూ ఏకమై సువర్ణ భారతాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు కేసీఆర్.

ఒడిశా మాజీ సీయం గమాంగ్ బీఆర్ఎస్ లో చేరిక

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, ఆ మహా ఉద్యమంలో కలిసి వస్తున్న ఒడిశా రాష్ట్ర నాయకులకు స్వాగతం పలుకుతున్నామని అన్నారు సీయం కేసీఆర్. ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో చేరారు. గిరిధ‌ర్ గమాంగ్ , ఆయ‌న కుమారుడు శిశిర్ గ‌మాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో గిరిధ‌ర్ గ‌మాంగ్, ఆయన భార్య హేమ, కుమారుడు ఇతర నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్‌ సొంత రాష్ట్రం నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. గమాంగ్ లోక్‌సభ సభ్యుడిగా ఉంటూనే 1999 ఫిబ్రవరి నుంచి పది నెలల పాటు ఒడిశా 13వ సీయంగా పని చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో, చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు గమాంగ్. అప్పట్లో పార్టీల బలాబలాలు చాలా సంక్లిష్టంగా ఉండటంతో, అవిశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత గిరిధర్ గమాంగ్ 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.

Next Story