బీఆర్ఎస్ పార్టీ నాందేడ్, పరేడ్ గ్రౌండ్స్ సభలకు జాతీయ నేతలు, సీయంలు

National Leaders To Take part In Nanded And Parade Grounds BRS Public Meeting

By -  Nellutla Kavitha |  Published on  25 Jan 2023 1:45 PM IST
బీఆర్ఎస్ పార్టీ నాందేడ్, పరేడ్ గ్రౌండ్స్ సభలకు జాతీయ నేతలు, సీయంలు

తెలంగాణ రాష్ట్రం నూతనంగా నిర్మించిన సచివాలయ భవన ప్రారంభోత్సవం భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల సీఎంలు, ఒక ఉప ముఖ్యమంత్రి, మరో జాతీయస్థాయి నాయకుడు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వీరితో పాటుగా బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఆ సభలో కూడా ఈ నేతలంతా పాల్గొనబోతున్నారు.

ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో కూడా మూడు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులు పాల్గొన్నారు. అయితే ఖమ్మంలో జరిగిన సభకు మలివిడత కంటి వెలుగు ప్రారంభోత్సవానికి కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను ఆహ్వానించిన సీఎం కేసీఆర్, ఫిబ్రవరి 17న జరగబోతున్న సచివాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీతో భాగస్వాములుగా ఉన్న ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న నూతనంగా నిర్మించిన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, ఝార్కండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తరఫున ఆయన ప్రతినిధి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌ హాజరవుతున్నారు. ఇక నూతన సచివాలయానికి డా. బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో ఆయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటుగా ఇతర ప్రముఖులు పాల్గొంటారని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

ఫిబ్రవరి 17న ఉదయం 11:30 గంటల నుంచి 12:30 మధ్యలో సచివాలయ భవనాలను ప్రారంభించనున్నారు. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం నిర్వహిస్తారు. 2019 జూన్ 27న నూతన సచివాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో మూడున్నర ఏళ్లలోనే అందుబాటులోకి వచ్చింది నూతన సచివాలయం.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఫిబ్రవరి 5న భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలోని నాందేడులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సీఎం కేసీఆర్ తో పాటుగా పార్టీ సీనియర్ నేతలు హాజరు కాబోతున్నారు ఇప్పటికే పలు దఫాలుగా ఆ ప్రాంతంలో పర్యటనలు చేసి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సభ ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేత బాలమల్లును ఇందుకు ఇన్చార్జిగా ఎంపిక చేశారు. ఇందుకోసం ఇప్పటికే సభ నిర్వహణకు స్థల పరిశీలన చేసి వచ్చారు గులాబీ నేతలు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా తెలంగాణ బయట జరుగుతున్న మొదటి బహిరంగసభ కావడంతో నాందేడు సరిహద్దుల్లో ఉన్న ఎమ్మెల్యేలకి బాధ్యతల్ని అప్పగించారు సీఎం కేసీఆర్. దీనికి జాతీయ నేతలు కూడా హాజరవుతారని పార్టీ నేతలు చెపుతున్నారు.

ఇక దీంతో పాటుగానే ఫిబ్రవరి 17న పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభ మీద కూడా ఫోకస్ పెట్టారు. ఖమ్మం సభకు కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే ఫిబ్రవరి 17న జరగనున్న సభకు కాంగ్రెస్ తో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. దీంతో అది జాతీయస్థాయి ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది. గతంలోనే భారత రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రకటన సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తమ మద్దతు ప్రకటించారు. ఇక తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ విలీనానికి ముందుకొచ్చింది. కర్ణాటకలో పాదయాత్రలో ఉన్న సందర్భంగా కుమారస్వామి ఖమ్మం సభకు హాజరు కాలేదు. ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖమ్మం సభకు కూడా హాజరయ్యారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రలతో సహా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా ఖమ్మం సభలో గవర్నర్ల వ్యవస్థపై మండిపడ్డారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మెచ్చుకోవడంతోపాటుగా తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని కూడా చెప్పారు. ఇక 17న జరగబోతున్న సభలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి సోరన్, బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జెడి నేత తేజస్వి యాదవ్, జేడీయు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ ఎలా రియాక్ట్ అవుతారు? ఏం మాట్లాడతారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Next Story