రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్‌ డే వేడుకలు

Republic Day Celebrations In RajBhavan - Governor Asks Officials To Make The Preparations

By -  Nellutla Kavitha |  Published on  24 Jan 2023 8:18 AM GMT
రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్‌ డే వేడుకలు

ఈనెల 26న రిపబ్లిక్ డే వేడుకలను రాజభవన్ లోనే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నిర్ణయించారు. గవర్నర్ ఆదేశాల మేరకు అధికారులు గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ప్రారంభించారు. 26వ తేదీ ఉదయం ఏడు గంటలకు గవర్నర్ రాజభవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం జరిగే వేడుకల్లో పాల్గొని పుదుచ్చేరికి బయలుదేరి వెళ్తారు గవర్నర్ తమిళిసై. పుదుచ్చేరిలో లెఫ్ట్నెంట్ గవర్నర్ హోదాలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి హైదరాబాదుకి చేరుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు రాజుభవన్ లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొంటారు గవర్నర్. రాజ్ భవన్ లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటుగా, సాయంత్రం జరిగే తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు, ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు.

గతంలో గణతంత్ర వేడుకలు సికింద్రాబాద్లో ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగేవి. అయితే కరోనా కారణంగా ఆ వేడుకలను నాంపల్లి లో ఉన్న పబ్లిక్ గార్డెన్ మార్చారు. అయితే గత ఏడాది వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో గవర్నర్ రాజభవన్ లోనే రిపబ్లిక్ డే ను నిర్వహించారు. అయితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరేడ్ గ్రౌండ్స్ లేదా పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు నిర్వహిస్తారా అనే అధికారిక సమాచారం ఇంకా లేదు. అయితే రాజభవన్ లో జరిగే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు లేవని, ఆరోజు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేడుకలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

గత ఏడాది కూడా గణతంత్ర దినోత్సవం కేవలం రాజభవాన్ కు మాత్రమే పరిమితమైంది. కరోనా కారణంగా పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించే పరిస్థితులు లేనందున రాజ్ భవన్ లో నిర్వహించుకోవాలని ప్రభుత్వం గవర్నర్ కి సూచించింది. అయితే అప్పటి వేడుకలకు ముఖ్యమంత్రి సహా మంత్రులు చివరకు ఎమ్మెల్యేలు కూడా హాజరు కాకపోవడాన్ని తప్పు పట్టారు గవర్నర్ తమిళిసై. ప్రభుత్వం పంపించిన ప్రసంగ కాపీని కాకుండా తాను చెప్పాలనుకున్న అంశాలను ప్రసంగంలో చెప్పారు గవర్నర్.

ఈమధ్య తరచూ గవర్నర్ ప్రోటోకాల్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి రిపబ్లిక్ డే రోజైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ని పాటిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ప్రభుత్వం తరఫున ప్రసంగ కాపీ గవర్నర్ ఆఫీస్ కి చేరలేదని సమాచారం. ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కాబోతున్నాయి. గత అసెంబ్లీ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. గవర్నర్ ను దూరం పెట్టడానికే అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ. అయితే అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదని, గత సమావేశాలకు ఇది కొనసాగింపుగా ప్రభుత్వం చెబుతోంది.

పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపించిన ఫైల్ ను గవర్నర్ తిరస్కరించడంతో మొదలైన దూరం ఇప్పటికి కొనసాగుతోంది. ముఖ్యమైన ఏడు బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తన దగ్గరే పెండింగ్ లో పెట్టుకున్నారని ప్రభుత్వం అంటోంది. ఇక ఇటీవలే ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నాయకులు గవర్నర్ల వ్యవస్థ మీద మండిపడ్డారు. వీటన్నిటిమీద అసహనాన్ని వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానిస్తున్నారంటూ గతంలోనే విచారం వ్యక్తం చేశారు.

Next Story