దేశంలో ప్రబల మార్పుకు సంకేతం ఖమ్మం సభ - సీయం కేసీఆర్
Telangana CM KCR Says They Will Come Into Power In 2024
By Nellutla Kavitha Published on 18 Jan 2023 1:11 PM GMTదేశంలో ప్రభలమైన మార్పునకు ఖమ్మం బీఆర్ఎస్ సభ సంకేతమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుతమైన సభ అని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఖమ్మం మునిసిపాలిటీకి రూ.50 కోట్లు నిధులు మంజూరు చేయడంతోపాటుగా, ఇతర మున్సిపాలిటీలైన మధిర, వైరా, సత్తుపల్లికి తలా రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా సీయం తెలిపారు. జిల్లాలోని 589 పంచాయతీలకు గాను ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నిధులు మంజూరు చేసారు. దీంతోపాటే ఖమ్మం జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ, 10 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
ఇక ఖమ్మం హెడ్ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు నెల రోజుల్లోనే మంజూరు చేస్తామని, ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు సీయం కేసీఆర్. ఈ సందర్భంగా “2024 తర్వాత మీరు ఇంటికి - మేం ఢిల్లీకి” అనే నినాదాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ లేదా బీఆర్ఎస్ బలపరిచిన కూటమి అధికారంలోకి వస్తే, దేశంలో కరెంట్ సమస్యలు పరిష్కరిస్తామని, రెండేళ్లలో వెలుగుజిలుగుల భారత్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ వస్తే దేశవ్యాప్తంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్ధానం చేశారు. ప్రైవేటీకరణను తప్పుబట్టిన ఆయన బీజేపీ సర్కార్ ప్రైవేటీకరిస్తున్న సంస్థలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. మోదీ పాలసీ ప్రైవెటైజేషన్, మాది నేషనలైజేషన్ అని పిలుపునిచ్చారు.
నదీ జలాలతో ప్రజల గొంతు నింపాలని, పొలాలను తడపాలని అన్నారు సీయం. ఎన్నో వనరులు ఉన్న మన దేశంలో మనం పిజ్జాలు, బర్గర్లు తినాలా అని ఆయన ప్రశ్నించారు. మంచినీరు ఇవ్వడం కేంద్రానికి చేతకావడం లేదని ఆయన విమర్శించారు. నదీ జలాలు సముద్రం పాలవుతుంటే చూస్తూ కూర్చుంటున్నారని ఆయన మండిపడ్డారు. 139 కోట్ల మంది జనాభా కలిగివున్నప్పటికీ మనం యాచకులగా ఎందుకవ్వాలని, ఏ దేశాన్ని చేయి చాపాల్సి అడిగే అవసరం లేనంత సంపద మన దేశానికి ఉందని అన్నారు కేసీఆర్. అయినా ఎందుకు యాచకుడిలా చేయి చాపాలని, అవసరమైతే మరో ఉద్యమం తప్పదని, దేశప్రజల కష్టాలు తీర్చడానికి పుట్టిందే BRS అని స్పష్టం చేశారాయన. నీటి యుద్ధాలు మన దేశంలో అవసరమా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య కేంద్రం కొట్లాటలు పెడుతోందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రజా సమస్యలు వదిలేశారని మండిపడ్డారు సీఎం.
తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధును మీరు అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా మేమే అయిదేళ్లలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చట్టసభల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పించడంతో పాటుగా, BRS అధికారంలోకి వస్తే దేశమంతా మిషన్ భగీరథను అమలు చేసి ఇంటింటికి స్వచ్చమైన తాగునీరు అందిస్తామన్నారన్నారు సీయం కేసీఆర్.