ఖమ్మంలో బీఆర్ఎస్ సమరశంఖం

Khammam Is All Set For BRS Party Meeting

By Nellutla Kavitha  Published on  18 Jan 2023 6:10 AM GMT
ఖమ్మంలో బీఆర్ఎస్ సమరశంఖం

మరికొద్ది సేపట్లో ఖమ్మంలో జరగబోతున్న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత బీఆర్ఎస్ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఖమ్మం మీదే కేంద్రీకృతమై ఉంది. ఖమ్మం వేదిక ద్వారా భారత రాష్ట్ర సమితి జాతీయ ఎజెండాను ప్రకటించబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సభకు కార్యకర్తలు వస్తున్నారని గులాబీ నేతలు చెప్తున్నారు. ఐదు లక్షల మంది సభకు హాజరవుతారన్న అంచనాతో 100 ఎకరాల్లో మైదానాన్ని సిద్ధం చేశారు పార్టీ నేతలు. మరోవైపు జాతీయ స్థాయి నేతలు కూడా ఈ సభకు హాజరవుతుండడంతో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా భారత రాష్ట్ర సమితి ఏజెండా కూడా ఉండబోతుందని చెప్తున్నారు గులాబీ నేతలు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదాన్ని గతంలోనే ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశవ్యాప్తంగా ఉన్న రైతు ప్రయోజనాలే ముఖ్యమంటూ రైతులకు ఉచిత విద్యుత్ వాగ్దానాన్ని కూడా గతంలోనే చేశారు కేసీఆర్. బిజెపికి ప్రత్యామ్నాయంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసే కార్యాచరణను చేపట్టారు కేసీఆర్. ఇందులో భాగంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పలు దఫాలుగా భేటీలు జరిగాయి. జేడీఎస్ తో పొత్తుపై సంకేతాలు కూడా ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ని నియమించారు. త్వరలో అక్కడ బహిరంగసభల్ని జరపాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఇక ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రైతు నేతలతో పాటుగా జాతీయ నాయకుల కూడా హాజరయ్యారు. ఈరోజు ఖమ్మం లో జరుగుతున్న టిఆర్ఎస్ ఆవిర్భావ సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర జాతీయ నాయకులు కూడా హాజరవుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి పీనరై విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా హాజరవుతున్నారు. వీరంతా నిన్న సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖమ్మం సభ ద్వారా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పాదయాత్రలో ఉండడంతో ఖమ్మం సభలో పాల్గొనట్లేదు. ఇక తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ గతంలోనే బిఆర్ఎస్ లో విలీనానికి ముందుకొచ్చింది. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కెసిఆర్ ఈరోజు సభలో ప్రసంగించనున్నారు. ఇవాల్టి బహిరంగ సభ ద్వారా దేశానికి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారని చెప్తున్నారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ ఏర్పాటు ఆవశ్యకత, భారత దేశంలో ఉన్న ఆర్థిక వనరులు, వాటి వినియోగం గురించి ప్రసంగంలో వివరించే అవకాశాలున్నాయి.

సీఎం కేసీఆర్ తో ప్రత్యేక హెలికాప్టర్లలో బయలుదేరి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ఖమ్మం చేరుకుంటారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ తో పాటుగా మిగతా ముఖ్యమంత్రిలు జాతీయ స్థాయి నేతలు ఖమ్మం బయలుదేరుతారు. నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కంటి వెలుగు మలి విడత కార్యక్రమంలో పాల్గొంటారు నేతలంతా. మధ్యాహ్నం భోజనం తర్వాత రెండు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. 100 ఎకరాల్లో బహిరంగ సభ మైదానాన్ని ఏర్పాటు చేశారు. పది రోజుల నుంచి ఖమ్మం లోనే మకాం వేసిన మంత్రి హరీష్ రావు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా సభ ఉండాలని, ఇక్కడి నుంచే సమర శంఖం కెసిఆర్ పూరిస్తారని చెప్తున్నారు గులాబీ నేతలు.

నూతన కలెక్టరేట్ భవనం వెనకాల 100 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 480 ఎకరాల్లో పార్కింగ్ కోసం కేటాయించారు. సభను వీక్షించడానికి 50 ఎల్ఈడి స్క్రీన్ లను అమర్చారు. ప్రధాన వేదికకు 20 అడుగుల దూరంలో ధూంధాం కళాకారుల కోసం మరొక వేదికను ఏర్పాటు చేశారు. మహిళలు పురుషుల కోసం విడివిడిగా 75 వేల కుర్చీలను సిద్ధం చేశారు.

Next Story
Share it