వందరోజుల పాటు కొనసాగే కంటివెలుగు రెండోవిడత

Second Phase Kanti Velugu Curtain Raiser

By Nellutla Kavitha  Published on  17 Jan 2023 9:56 AM GMT
వందరోజుల పాటు కొనసాగే కంటివెలుగు రెండోవిడత

100 రోజుల్లో 1.54 కోట్ల‌మందికి కంటి ప‌రీక్ష‌లు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుని రెండో విడత కంటివమలుగు ప్రారంభిస్తున్నట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు స్పష్టంచేసారు. ఈ కార్యక్రమం రేపు ప్రారంభమయి, వంద రోజుల పాటు కొనసాగి, జూన్‌ 15వ తేదీన ముగియనున్నది. అంధ‌త్వ నివార‌ణ చ‌ర్య‌లో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింద‌ని, అందుక‌ని ప్ర‌తీ ఒక్క‌రు కంటి ప‌రీక్ష‌లు చేసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు హ‌రీశ్ రావు. ఇందులో భాగంగా వారంలో ఐదురోజులు మాత్రమే శిబిరాలను ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించనున్నారు. శని, ఆదివారాలతో పాటుగా ఇతర సెలవుల్లో ఈ పరీక్షలకు మినహాయింపు ఇచ్చారు.

పేద ప్ర‌జ‌ల్లో రెటినోప‌తి స‌మ‌స్య తీవ్రంగా ఉందని, కంటి చూపు కోల్పోయిన వాళ్ల‌కు ఈ ప‌థ‌కం భ‌రోసా ఇస్తుందని హరీష్ రావు అన్నారు. రెండో విడత కంటివెలుగు కార్య‌క్ర‌మం అమ‌లు, నిర్వ‌హ‌ణ గురించి మంత్రి హ‌రీశ్ రావు సమీక్ష నిర్వహించారు. కంటి ప‌రీక్ష‌లు చేసి రీడింగ్ గ్లాస్ అవ‌ప‌ర‌మైన వాళ్ల‌కు అదే రోజు క‌ళ్ల జోడు అందజేస్తారని, దాదాపు 30 - 35 ల‌క్ష‌ల రీడింగ్ గ్లాసెస్‌ తో పాటుగా 20 - 25 ల‌క్ష‌ల ప్రిస్క్రైబ్‌డ్ క‌ళ్ల‌జోళ్లు అవ‌స‌ర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

ప్రపంచంలోనే ‘కంటి వెలుగు’ అతిపెద్ద కార్యక్రమమని, దేశవ్యాప్తంగా ప్ర‌భుత్వ వైద్య సేవ‌ల్లో మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంద‌ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కంటివెలుగును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 18న ఖమ్మంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని సీయం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. ఇక 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్‌ చైర్మన్లు, చైర్‌పర్సన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు అందరూ కోఆర్డినేట్‌ చేసుకొని తప్పనిసరిగా ఉదయం 9 గంటలకు ప్రారంభించేలా కలెక్టర్ల, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు షెడ్యూల్‌ రూపొందించుకోవాలని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు.

ప్ర‌తి ఇంటికి కంటివెలుగు ఆహ్వాన పత్రిక అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. కంటి వెలుగు క్యాంపుల‌కు తప్ప‌నిస‌రిగా ఆధార్ కార్డు తీసుకురావాల‌ని మంత్రి సూచించారు.

2018 లో ప్రారంభించిన తొలి విడ‌త కంటి వెలుగులో కోటి 50 లక్ష‌ల మందికి పరీక్ష‌లు చేసి, 51 ల‌క్ష‌ల మందికి ఉచితంగా క‌ళ్ల‌జోళ్లు అందించారు. 2018 ఆగ‌ష్టులో మెద‌క్ జిల్లా మ‌ల్కాపూర్ గ్రామంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైందీ తొలివిడత కంటివెలుగు. మొదటి ద‌శ‌లో చైనా నుంచి క‌ళ్ల‌జోళ్లను దిగుమతి చేసుకున్నారు, అయితే ఈసారి తెలంగాణ కంపెనీల నుంచి క‌ళ్ల‌జోళ్లను కొనుగోలు చేశారు.

ఇక కంటి వెలుగు పరీక్ష‌లు చేసే ఒక్కో బృందంలో ఒక వైద్యాధికారి, ఒక అప్టోమెట్రిస్ట్, ఇద్ద‌రు / ముగ్గురు క‌మ్యూనిటీ హెల్త్ ఆఫీస‌ర్లు ఉంటారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు మందులు, క‌ళ్ల‌ద్దాలు చేరాయి. 1500 టీమ్‌ల‌తో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని, రోజుకు ఒక్కో వైద్య బృందం 100నుంచి 150 మందిని ప‌రీక్షిస్తుందని హరీష్ రావు అన్నారు.

Next Story