నా ఫోన్ ట్యాప్ అవుతుందని అనుమానంగా ఉంది - గవర్నర్ తమిళిసై

Telangana Governor TamiliSai Says Her Phone Calls Being Tapped

By -  Nellutla Kavitha |  Published on  9 Nov 2022 1:17 PM GMT
నా ఫోన్ ట్యాప్ అవుతుందని అనుమానంగా ఉంది - గవర్నర్ తమిళిసై

తన ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి తన ఏడీసీ తుషార్ ఫోన్ చేస్తే, టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సంబంధం ఉందంటూ పోస్టులు పెడుతున్నారని, తన ఫోన్ ట్యాప్ అవుతుందని అనిపిస్తోందని గవర్నర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానం అమలవుతోందనే అనిపిస్తుందని అన్నారు గవర్నర్. రాజ్‌భవన్ తలుపులు ఎప్పటికీ తెరుచుకున్ ఉంటాయని, ప్రగతిభవన్ మాదిరిగా కాదని అన్న తమిళిసై తనను ఎవరైనా కలిసే అవకాశం ఉందని అన్నారు.

ప్రజా సమస్యల విషయంలో తాను సానుకూలంగా స్పందిస్తానని, తాను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాననడం ఆశ్చర్యంగా ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. సీఎంవో నుంచి విద్యాశాఖా మంత్రికి లేఖ రావడానికి జాప్యమైతే, సమస్యలు ప్రగతిభవన్‌కు ఎలా చేరుతాయని ఆమె నిలదీశారు.

తనకు ఎలాంటి భేషజాలు లేవని, ఇగో అసలే లేదని అన్నారు గవర్నర్. ఇటీవలి తన పర్యటనల గురించి ప్రభుత్వానికి అన్ని వివరాలు ఇస్తున్నానని, ప్రొటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని తమిళిసై ప్రశ్నించారు. రాజ్‌భవన్ ప్రతిష్ఠను తగ్గించాలని చూస్తున్నారని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తారని విద్యార్థుల ఐకాస పేరిట వార్తలు వస్తున్నాయని, రాజ్‌భవన్ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని, ధర్నాలు చేసేబదులు లోపలికి వచ్చి తనతో చర్చించవచ్చని స్పష్టం చేశారు గవర్నర్. గతంలో బాసర విద్యార్థులు, మిగతా విద్యార్థులు తనను కలుసుకునేందుకు వచ్చారని గుర్తు చేశారు.

Next Story