మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకుంటే స్థానిక ఎమ్మెల్యే అక్కరలేదా - బీజేపీ ఎంపీ లక్ష్మణ్
BJP RajyaSabha MP Lakshman Reacts On KTR Comments On Adopting Munugode Constituency
By - Nellutla Kavitha | Published on 16 Oct 2022 3:19 PM GMTఉపఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపిస్తే కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటా అన్నారని, అంటే స్థానిక ఎమ్మెల్యేలు అక్కర లేదా అని ప్రశ్నించారు బీజేపీ రాజ్యసభ ఎంపీ మునుగోడు - డాక్టర్ లక్ష్మణ్. మునుగోడు ఒక్కటే దత్తత తీసుకుంటారా మిగిలిన నియోజకవర్గాలు అక్కర లేదా అని ఆయన మునుగోడును ప్రచారంలో భాగంగా ప్రశ్నించారు. జిల్లా మంత్రితో పాటుగా మిగిలిన మంత్రులంతా పని చేయరా, వాళ్లెందుకు మునుగోడు గోడును పట్టించుకోలేదు, వాళ్లంతా కేసీఆర్ కుటుంబానికి, ఊ కొట్టే డూడూ బసవన్నలా మరి అని ఆయన మండిపడ్డారు.
ప్రజలను బానిసలుగా చేసి పరిపాలించిన రజాకార్ల రాజ్యం అని తండ్రులు, తాతలు చెప్పే వాళ్లు కానీ ఇప్పుడు ప్రజస్వామ్యంలో కూడా రజాకార్ల పాలన ప్రత్యక్షంగా చూపిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రజలకు తమ గోడు, బాధలు, కష్టాలు, నష్టాలు చెప్పే అవకాశం లేదని, స్వేచ్చ- స్వాతంత్రాలు ప్రగతి భవన్ లో బందీ అయిపోయాయి కాబట్టే జనం తమ కోపాన్ని ఉప ఎన్నికల్లో ఓట్లను బీజేపీకి వేస్తున్నారని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి 2014 నుంచి కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా వచ్చిన నిధులెంత, తెంగాణ సర్కారు నుంచి వచ్చిన నిధులెన్నో చెప్పే దమ్ముందా ? ఆ నిధుల మీద శ్వేత పత్రం ఇచ్చే దమ్ముందా కేసీఆర్ ? అని ఆయన నిలదీసారు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు గుర్తున్నాయా కేటీఆర్ అని ఆయన ప్రశ్నించారు. ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ కనీసం కన్నెత్తి కూడా చూడని మీరు ఇక్కడికి వచ్చి నీతి సూత్రాలను వల్లె వేస్తున్నారని అన్నారు లక్ష్మణ్.
దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు దొరికినా ప్రతీ లింక్ తెలంగాణలో ఉంటదని, దానికి తోడు దేశంలో ఎక్కడ అవినీతి, అక్రమాలు జరిగినా కూడా వాటి లింక్ మీ పార్టీ నాయకుల్లో, మీ కుటుంబ సభ్యుల చుట్టూ ఉంటదని ఆయన ఎద్దేవా చేసారు. ఇదీ గత ఎనిమిది సంవత్సరాలుగా మీరు సాధించిన ప్రగతి అని మునుగోడు ఫలితం తర్వాత మీ కారు పర్మనెంట్ అడ్రెస్ గ్యారేజీ మాత్రమేనని, బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు మిగిలేది వీఆర్ఎస్ మాత్రమే అన్నారు లక్ష్మణ్.