మునుగోడులో బీజేపీ కొనుగోలు పర్వానికి తెరలేపింది - మంత్రి హరీష్ రావు
BJP Started Buying Leaders In Munugode To Win By-election Says Min Harish Rao
By - Nellutla Kavitha | Published on 9 Oct 2022 3:00 PM ISTమునుగోడు ఉపఎన్నిక బీజేపీ తెచ్చి పెట్టిన ఉపఎన్నిక, బీజేపీ దొడ్డిదారిన కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉపఎన్నిక లో గెలవాలని చూస్తోందని, ఒక్కో నేతకు ఒక్కో రేటు చెల్లించి బీజేపీ కొనుగోలు పర్వానికి తెర లేపిందని అన్నారు మంత్రి హరీష్ రావు. నేతలకు ఇవ్వడానికి బీజేపీ 200 బ్రిజా కార్లు, 2 వేల మోటార్ బైక్ లు బుక్ చేసినట్టు తమకు స్పష్టమైన సమాచారం అందిందని, తమ కార్యకర్తలు దీనిపై నిరంతరం నిఘా పెట్టారని హరీష్ అన్నారు.
మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం గెలవాలా, రాజగోపాల్ రెడ్డి ధనం గెలవాలా ఆలోచించుకోవాలని ఆయన పులుపునిచ్చారు. 15 వేల కాంట్రాక్టు కోసం రాజ గోపాల్ రెడ్డి తెచ్చిన ఉప ఎన్నికని, బీజేపీ కి చెప్పుకోవడానికి ఏం లేక దిక్కుమాలిన దిగజారిన రాజకీయం చేస్తోందని అన్నారు మంత్రి. బీజేపీకి ఏం లేకనే క్షుద్ర విద్యలు, మూఢ నమ్మకాలు అంటూ పుకార్లు సృష్టిస్తున్నారని, ఆ విద్యలన్నీ బీజేపీ కే తెలుసని అన్నారు మంత్రి.
మునుగోడులో టీ ఆర్ ఎస్ గెలుస్తుందని తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, కేంద్ర మంత్రి సీతారామన్ కూడా ఆధారాలు లేకుండా దివాళాకోరు తనంతో మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు. మంత్ర తంత్రాలతో కాకుండా ప్రజా ఉద్యమాల తో అధికారంలోకి వచ్చామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వారణాసి హిందు విశ్వ విద్యాలయంలో భూత వైద్యం కోర్సు ప్రారంభించిందని, ఈ కోర్సు కు 50 వేల రూపాయలు ఫీజుగా నిర్ణయించారని, బండి సంజయ్ ఈ కోర్సు లో చేరితే మంచిదని సలహా ఇచ్చారు హరీష్. నల్ల పిల్లులు ,చేతబడులు, నిమ్మకాయలు, మిరపకాయలు ఇవన్నీ బీజేపీ కే తెలుసని అన్నారు. నిర్మల గారు మాకు తెలిసింది తాంత్రిక్ విద్య కాదు లోక్ తాంత్రిక్ విద్య మాత్రమేనని అన్నారు. ఉట్టి కి ఎగురనమ్మా స్వర్గానికి ఎగిరినట్టుంది అని BRS గురించి నిర్మలా సీతారామన్ వ్యంగ్యంగా మాట్లాడారని, తాము తెలంగాణ సాధించి ఉట్టికి ఎగిరామని, ఇపుడు దేశ వ్యాప్తంగా తెలంగాణ పథకాల అమలు చేసేందుకు BRS పెట్టాంమని అన్నారు హరీష్ రావు.