క్షుద్ర పూజలు చేస్తున్న సీయం కేసీఆర్ - బండి సంజయ్
CM KCR Believes In Black Magic Says Bandi Sanjay
By - Nellutla Kavitha | Published on 8 Oct 2022 5:05 PM ISTబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాంత్రికుడి సలహా మేరకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారని ఆయన అన్నారు. తాంత్రికుడి సూచనతోనే సచివాలయానికి కేసీఆర్ వెళ్లడం లేదని, ఫాంహౌజ్ లో నిత్యం నల్ల పిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ఈ విషయం తనకు ఓ స్వామిజీ తెలిపారని, కేసీఆర్ చేస్తున్న పనులు, గత చరిత్రను విశ్లేషించిన తరువాతే వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెబుతున్నానన్నారు సంజయ్. స్వామిజీలు, వేద పండితులతోపాటు సమాజ హితం కోరే వాళ్లంతా కేసీఆర్ క్షుద్ర పూజల నుండి తెలంగాణను కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.
ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసిందని, ఆయన ప్రజల ఆశీర్వాదంతో ఎట్టి పరిస్థితుల్లోను భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు సంజయ్. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయినట్టే ఇక్కడ కూడా టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు బండి సంజయ్.
ఇక ఈడీ దాడులపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అవినీతి, అక్రమాలు చేసి కోట్లు సంపాదిస్తూ, అవినీతి, హత్యలు, మాన భంగాలు చేస్తుంటే ఈడీ, సీబీఐ చూస్తూ ఊరుకుంటదా అని ప్రశ్నించారు సంజయ్. లిక్కర్ స్కాంలో, చీకోటి పత్తాల స్కాంలో, డ్రగ్స్ కేసులో తన కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారని, 2014 ఎన్నికల్లో సీఎం, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లలో ఉన్న ఆస్తులెన్ని? ఇప్పుడు సంపాదించినవన్నో దమ్ముంటే బయటపెట్టండని ఆయన డిమాండ్ చేసారు.