ఇల్లు చక్కదిద్దాం - ఇప్పుడు దేశం బాగు కోసమే బీఆర్ఎస్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

BRS Is For The Development Of The Nation : Min Srinivas Goud

By -  Nellutla Kavitha |  Published on  6 Oct 2022 11:53 AM GMT
ఇల్లు చక్కదిద్దాం - ఇప్పుడు దేశం బాగు కోసమే బీఆర్ఎస్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చడంపై తెలంగాణ విపక్ష నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించారు. విజయదశమి రోజు టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్‌ జాతీయ పార్టీ పేరు ప్రకటించారు. దాంతోపాటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈరోజు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ బృందం కలిసింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా చేసిన తీర్మాన కాపీ, కేసీఆర్‌ లేఖను ఈ బృందం అందజేశారు. భారత్ రాష్ట్ర సమితి పేరును సీఈసీ లో నమోదు చేయాలని వినతి చేశారు. టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతూ నిన్న పార్టీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాన్ని సీఈసీకి వివరించారు.

విపక్షాలు మాత్రం పార్టీ పేరు మార్పు తో పాటుగా, జాతీయ పార్టీ ప్రకటనపై తీవ్రంగా ప్రతిస్పందించాయి. రాజకీయ దురాశతోనే ఈ ఆలోచన పుట్టిందని విపక్ష నేతలు ఆరోపించారు. పేరు మార్చినంత మాత్రాన ఏ పార్టీ జాతీయ పార్టీగా మారదని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని చంపేశారని, కుటుంబ కలహాలు తీర్చుకునేందుకు, కేసీఆర్ రాజకీయ దురాశను నెరవేర్చుకునేందుకు ఇలా చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

మరోవైపు కేసిఆర్ BRS ప్రకటనపై ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. BRS ప్రకటనతో తెలంగాణకు కేసిఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని, ఉద్యమ పార్టీని ఖతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి, కెసిఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని ఆయన అన్నారు. ఆ పార్టీస్థాపనతోనే తెలంగాణాకి కెసిఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని, తెలంగాణా ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయిందని ఈటల అన్నారు. తెలంగాణఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కెసిఆర్ కి ఉన్న బంధం తెగిపోయింది. కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తరువాత ఆయన నమ్ముకుంది మద్యాన్ని, డబ్బుని ప్రలోభాలను అని, అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయం చెలామణి చేయాలని కల పగటికలకంటున్నారు అని ఈటల రాజేందర్ అన్నారు.

బిఆర్ఎస్ మీద ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యల మీద మంత్రి శ్రీనివాస్ గౌడ్ న్యూస్ మీటర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల మీద స్పందించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

న్యూస్ మీటర్: తెలంగాణకు, టీఆర్ఎస్ కు మధ్య ఉన్న బంధం తెగిపోయింది అన్న వ్యాఖ్యలపై మీ సమాధానం ఏమిటి?

శ్రీనివాసు గౌడ్: ఇల్లు చక్కదిద్దిన టిఆర్ఎస్ కు బలం పెరిగింది. తెలంగాణను బాగు చేసిన కెసిఆర్ ఇప్పుడు దేశం మేలు కోసమే జాతీయ పార్టీ ప్రకటించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోతున్నదని కేంద్రం అవార్డులు ఇస్తుంది. తెలంగాణ దేశంలోనే ఉంది, జాతీయ పార్టీ పెట్టి కెసిఆర్ విదేశాలకు వెళ్లి పోవట్లేదు. బిజెపి రెండు స్థానాల్లో గెలిచి ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి చేరింది. టీఆర్ఎస్ కూడా అలాంటి పరిస్థితికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా రైతులకు కావలసిన కరెంటు, నీళ్లు, గిట్టుబాటు ధర కెసిఆర్ వల్లే వస్తుందనే నమ్మకం ఉంది. అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారు.

న్యూస్ మీటర్: పేరు మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోతుందా అనే విమర్శకు మీ సమాధానం ఏంటి?

శ్రీనివాస్ గౌడ్: జాతీయ పార్టీ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. మేం అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తాం. దేశమంతా విస్తరిస్తామం. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమై లేదు. అది కూడా రెండు రాష్ట్రాల్లో విస్తరించింది, మేము కూడా అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తాం.

న్యూస్ మీటర్: కుటుంబ కలహాల తోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేశారనే ఆరోపణలున్నాయి?

శ్రీనివాస్ గౌడ్: మేమంతా ఒక్క కుటుంబమే, పార్టీ అంతా ఒక కుటుంబం. అలాగే పనిచేశాము. అలా అంటే, తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా ఒక కుటుంబంలాగే పోరాటం చేసింది. దేశమంతా శాంతినే కోరుకుంటున్నారు. హైదరాబాద్ లో ఎలాంటి గొడవలు లేవు. అలా గొడవలు లేని దేశం కావాలన్నదే అందరి కోరిక. నాయకులు తమ స్వార్థం ఏమైనా మాట్లాడొచ్చు.

Next Story