భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్

TRS is now BRS

By -  Nellutla Kavitha |  Published on  5 Oct 2022 11:16 AM GMT
భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి - టీఆర్ఎస్ 21 ఏళ్ల ప్రస్థానంలో విజయదశమి రోజు కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఉద్యమ పార్టీ, ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ను, భారత రాష్ట్ర సమితి - బీఆర్ఎస్‌గా మారుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీ బీఆర్ఎస్‌గా మారుస్తూ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాన్ని కేసీఆర్ ఆమోదించారు. ఆ తర్వాత సరికొత్త జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌ను సీయం కేసీఆర్‌ అధికారికంగా తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించారు.

పార్టీ సర్వసభ్య సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని సమావేశంలో పాల్గొన్న సభ్యులంతా బలపర్చారు. అనంతరం వారి సంతకాలు సేకరించారు. ఇక జాతీయ పార్టీ గా మారిన బీఆర్ఎస్ పార్టీ జెండా, ఎజెండాపై గులాబీ‌ నేతలకు సీయం కేసీఆర్ వివరించారు.

టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ బృందం ఢిల్లీకి తీసుకెళ్లనుంది. వీరు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని సమర్పిస్తారు. సీఈసి పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాత జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ ప్రస్థానం ప్రారంభం అవుతుంది.

భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చలు జరుపుతున్నారు కేసీఆర్. ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్రాంతికి భారీ బహిరంగ సభకు సీయం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో బీఆర్ఎస్‌ ఆదరణ ఉంటుందని గులాబీ నేతలు భావిస్తున్వారు. కర్ణాటక నుంచి జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు కేసీఆర్ ప్రకటించినా జాతీయ పార్టీకి మద్దతు ప్రకటించారు. తమిళనాడు విదుతలై చిరుతైగల్‌ కచ్చి (వీసీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు, చిదంబరం ఎంపీ తిరుమావళవన్‌ కూడా హైదరాబాద్ చేరుకుని మద్దతు తెలిపారు. వీరితోపాటుతమిళనాడు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావు కూడా కేసీఆర్ నుంచి ఆహ్వానం అందుకున్నారు.

Next Story