ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం?! క్లారిటీ ఇచ్చిన పోలీసులు
Security Breach At Gannavaram Airport?!
By - Nellutla Kavitha |
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కోసం ఈరోజు భీమవరంలో పర్యటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. గన్నవరం నుంచి భీమవరం కు హెలీకాప్టర్ లో వెళ్తున్న సమయంలో భారీగా నల్ల బెలూన్లు ఎగరడం కలకలం రేపింది. ప్రధాని పర్యటిస్తున్న హెలికాప్టర్ దగ్గరలో నల్ల బెలూన్లు ఎగరడంపై ఎస్పీజీ సీరియస్ అయింది అని, ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యం అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రధాని మోదీ పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని స్పష్టం చేశారు కృష్ణా జిల్లా డీ ఎస్ పి విజయపాల్ అన్నారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో బెలూన్లను ఎగురవేశారని, వాటిలో హైడ్రోజన్ కూడా లేదని స్పష్టం చేశారు డీ ఎస్ పి.
ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిరసన ప్రదర్శనలో భాగంగా నల్ల బెలూన్లు ఎగరవేశారు. నిబంధనలను అనుసరించి వారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ ప్రకటించారు. ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో బెలూన్లను ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ భవనం పైనుంచి వదిలారు యువకులు. గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. బెలూన్లను వదిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ హల్ చల్ చేశారు. ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు కొందరు కాంగ్రెస్ నేతలు. అయితే ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం ఏమీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రధాని హెలికాప్టర్ లో బయలుదేరిన ఐదు నిమిషాల తర్వాత నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని, వారిని కోర్టులో ప్రవేశ పెడతామన్నారు పోలీసులు.