హైదరాబాద్ లో ప్రారంభమైన ఆషాఢ మాస బోనాల జాతర
Ashada Masam Bonala Jathara Started At Golkonda Fort In Hyderabad
By Nellutla Kavitha
హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బోనాలు. ఆషాడ మాసం వస్తుందంటే చాలు జంట నగరాల్లోని అమ్మవారి ఆలయాలు అందంగా ముస్తాబవుతాయి. ఆషాడ మాసంలో బోనాల జాతర, తొలి బోనం గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబికా అమ్మవారికి సమర్పించడంతో ప్రారంభమవుతుంది. గోల్కొండ కోట పై ఉన్న జగదాంబికా అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో ఈరోజు ఆషాడ బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు.
తొట్టెల ఊరేగింపుతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, నెల రోజుల పాటు ఆదివారాల్లో, నగర వ్యాప్తంగా ఉన్న అన్ని అమ్మవారి దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వచ్చేనెల 5న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్యాణోత్సవం, పదవ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటం స్థాపనతో మొదలై, జూలై 18 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. జూలై 17న లాల్దర్వాజా సింహవాహిని అమ్మవారి ఘటాల ఊరేగింపుతో ఓల్డ్ సిటీలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 24న లాల్దర్వాజా ఆలయంతో పాటుగా జంటనగరాల్లో ఉన్న అన్ని అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగను నిర్వహిస్తారు.