రెండు ప్రత్యేక కార్యక్రమాలు - బిజీగా గడిపిన కేసీఆర్
Telangana CM KCR’s Busy Schedule Today Attending Special Events
By - Nellutla Kavitha |
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. ఈరోజు ఉదయం రాజ్ భవన్లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు సీఎం కేసీఆర్. ఇక సాయంత్రం టీ హబ్-2 బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. దాదాపు 9 నెలల తర్వాత రాజ్భవన్ గడప తొక్కడం ప్రాముఖ్యత సంతరించుకుంటే, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంకుబేటర్ సెంటర్ టి హబ్ -2 ప్రారంభించడం ఇంకో విశేషం.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లక చాలా కాలమైంది. గవర్నర్ తమిళి సైతో ఇటీవల కాలంలో ఆయన ఎక్కడా వేదిక పంచుకోలేదు. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. రాజ్ భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమాలకు కూడా ఆయా సీయం దూరమయ్యారు. గవర్నర్ ను కేసీఆర్ సర్కార్ వరుసగా అవమానానికి గురిచేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపించాయి. ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయినట్లుగా కనిపించాయి. రాజ్ భవన్లో జరిగే అధికారిక కార్యక్రమాలతో పాటుగా ఎట్ హోం కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు హాజరు కాలేదు. అయితే తెలంగాణ హైకోర్టుకు ఐదవ చీఫ్ జస్టిస్ గా భూయాన్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం హాజరయ్యారు. దీంతో ఇద్దరి మధ్య ఇంతకాలం నెలకొని ఉన్న పంచాయితీ ముగిసిందా లేదా అనే ఆసక్తికరమైన చర్చ ఇంకా కొనసాగుతోంది.
ఇక ఈ రోజు సీఎం రెండో అధికారిక కార్యక్రమంగా టీ హబ్ 2.0 ప్రారంభించారు నాలుగు వందల కోట్ల రూపాయలతో, మూడు ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ సెంటర్ ను నిర్మించింది. దేశంలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందని, ఆటోమోటివ్, ఫార్మా, అగ్రి, డిఫెన్స్, టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని అన్న కేసీఆర్, సరికొత్త ఆవిష్కరణలతో వచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని అన్నారు. ఒకేసారి నాలుగు వేలకు పైగా స్టార్టప్లకు వేదిక కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణలు ప్రాంగణంగా టీ హబ్ ఫెసిలిటీ center గా నిలుస్తుందని కేసీఆర్ అన్నారు. టీ హబ్ ద్వారా అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందుతాయని, దాని ద్వారా తెలంగాణ ఖ్యాతి మరింత పెరుగుతుందని ఏర్పాటుకు కృషి చేసిన కేటీఆర్, జయేశ్ రంజన్ కు అభినందనలు తెలిపారు కేసీఆర్.