మైనర్ల బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన జువైనల్ కోర్టు
Juvenile Court Rejects Bail Petition In JubileeHills Rape Case
By - Nellutla Kavitha | Published on 22 Jun 2022 3:07 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను జువెనైల్ జస్టిస్ కోర్టు తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు చేసిన వాదనలతో ఏకీభవించిన జువెనైల్ జస్టిస్ బోర్డు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.
ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు అయితే, వారిలో ఒకరు మేజర్. మిగిలిన ఐదుగురు మైనర్లు. వీరిలో నలుగురు మైనర్లు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ జువెనైల్ జస్టిస్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జువెనైల్ జస్టిస్ బోర్డు నిన్న విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు కోరారు. అయితే నలుగురు మైనర్లు సమాజంలో పలుకుబడి కలిగిన వారి పిల్లలేనని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కేసు దర్యాప్తు దశలో ఉన్న సమయంలో వీరికి బెయిల్ ఇస్తే, బాధితులతో పాటు సాక్షులను కూడా నిందితుల కుటుంబాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న జువెనైల్ జస్టిస్ బోర్డు, నిందితులకు బెయిల్ నిరాకరిస్తూ వారి పిటిషన్లను కొట్టేసింది. అయితే ఐదో మైనర్ కూడా రేపు జువెనైల్ జస్టిస్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం.