ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్

Post Allotted To Senior IPS Officer AB Venkateshwar Rao

By -  Nellutla Kavitha |  Published on  15 Jun 2022 8:18 PM IST
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్‌ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్ ఎత్తేయడంతో ఆయన 2022 మే 19న సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేశారు. సుప్రీం తీర్పును అనుసరించి ఏబీ వెంకటేశ్వరరావును ప్రింటింగ్‌ అండ్ స్టేషనరీ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా నియమిస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో ఉన్న జీ. విజయ కుమార్‌ ను రిలీవ్ చేసి, హోమ్‌ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

సీనియర్ ఐపీయస్అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 1989 బ్యాచ్ అధికారి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారని అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఆయనను విధుల్లో నుంచి తొలగించింది. భద్రత ఉపకరణాల కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో వెల్లడించింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుని మళ్లీ సర్వీసు లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏబీవీకి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story