పేదల గొంతుకగా బీజేపీ పనిచేస్తుంది, ఆశీర్వదించండి - బండి సంజయ్

Telangana BJP Chief Bandi Sanjay On KCR

By -  Nellutla Kavitha |  Published on  13 Jun 2022 4:14 PM GMT
పేదల గొంతుకగా బీజేపీ పనిచేస్తుంది, ఆశీర్వదించండి - బండి సంజయ్

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాల్జేసి అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలకు అడ్డగా తెలంగాణను మార్చారని పేర్కొన్నారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు ముమ్మాటికీ గ్లోబరీనా సంస్థే కారణమని ఉద్ఘాటించారు. కోర్టులంటే తమకు గౌరవముందని, టీఆర్ఎస్ నేతలు వేసే కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గ్లోబరీనా సంస్థ బండారాన్ని కోర్టుల ముందుంచి బయటపెడతామని స్పష్టం చేశారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 8 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్బంగా సేవ, గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాత్రి మేడ్చల్ నియోజకవర్గంలోని జవహార్ నగర్ లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు బండి సంజయ్ తోపాటు జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇతర నేతలు హాజరయ్యారు.

కేసీఆర్ నమ్మక ద్రోహి, మూర్ఖుడు, పేదల రక్తాన్ని పీల్చుకుంటున్నడు, మోదీ పథకాలను కూడా టీఆర్ఎస్ పథకాలుగా ప్రచారం చేసుకోవడం దుర్మార్గాన్ని అన్నారు. నేను సీఎంకు ఈ వేదికపై నుండి సవాల్ విసురుతున్నా, 8 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు మేం సిద్ధం, 8 ఏళ్ల నీ నిక్రుష్టపు, నియంత పాలనపై కేసీఆర్ సిద్ధమా? రాష్ట్రం, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు.

గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరని, వాళ్లు చేసిన పాపమేంది? ప్రశ్నించడానికి హైదరాబాద్ వచ్చిన తల్లిదండ్రుల కాళ్లు చేతులు విరగ్గొట్టిన మూర్ఖుడు కేసీఆర్ అని అన్నారు సంజయ్. అన్ని సబ్జెక్టుల్లో 90 కి పైగా మార్కులొస్తే, ఒక్క సబ్జెక్టులో మాత్రం గ్లోబరీనా సాంకేతిక తప్పిదంవల్ల ఒక్క మార్కు మాత్రమే వేసి ఫెయిల్ చేస్తే, ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారని అన్నారు బండి. నేను గ్లోబరీనా సంస్థ గురించి నేను మాట్లాడితే, హైకోర్టుకు వెళ్లి నన్ను తిట్టొద్దని ఆర్డర్ తెచ్చిండు,ఎన్ని కేసులైనా వేసుకో, బండి సంజయ్ భయపడడు. కోర్టును గౌరవిస్తాం, చట్టాలను గౌరవిస్తాం, కానీ గ్లోబరీనా సంస్థను వదిలిపెట్టను. నువ్వు విచారణ చేసి మూసివేసిన గ్లోబరీనా సంస్థ బండారం బయటపెడతానని హెచ్చరించారాయన.

Next Story