తెలంగాణలో ఈ నెలాఖరున మొదలయ్యే బోనాల జాతర

Hyderabad Bonalu Festival Is Going To Begin This Month End

By -  Nellutla Kavitha |  Published on  6 Jun 2022 12:44 PM GMT
తెలంగాణలో ఈ నెలాఖరున మొదలయ్యే బోనాల జాతర

తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక బోనాలు. ఆషాడ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం బోనం ఎత్తుంతుంది. వీధి వీధి అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఉత్సవాలు జరుపుకునేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు తలమానికంగా భావించే బోనాల ఉత్సవాలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర అధికారులు కలిసి బోనాల వేడుకపై సమీక్ష నిర్వహించి, బోనాల జాతర తేదీలను ఖరారు చేశారు. హైదరాబాద్ నగరంలో ఆషాడ మాస బోనాలు ఈ నెల 30న, గోల్కొండ బోనాలతో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30న గోల్కొండ కోటలో ఉన్న జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాలు ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు మంత్రులు. జూలై 17న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జరుగుతాయి. తెల్లవారి, జూలై 18న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో రంగం, భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాత వచ్చే ఆదివారం అంటే, జూలై 24న పాతబస్తీ బోనాలు జరుగుతాయి. లాల్దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జూలై 24న జరుగుతాయి. అదే రోజు భాగ్యనగర బోనాలు, జూలై 25న ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు జరుగుతుంది. జూలై 28న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

ప్రభుత్వం తరఫున వివిధ ఆలయాల్లో అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సమావేశంలో మంత్రులతోపాటు గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, వివిధ ఆలయాలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Next Story