ప్రకంపనలు సృష్టిస్తున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు
By సుభాష్ Published on 23 Sep 2020 11:19 AM GMTబాలీవుడ్ డ్రగ్స్ కేసు.. అటు టాలీవుడ్‌లోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో రకూల్, నమ్రత పేర్లు బయటకు రావడంతో టాలీవుడ్ సెలబ్రిటీల్లో అలజడి మొదలైంది. అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివరాలను కూడా ఎన్‌సీబీ తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ డీలర్ కెల్విన్‌తో పాటు డ్రగ్స్ వాడిన సెలబ్రిటీల వివరాలు కూడా ఎక్సైజ్ శాఖ నుంచి ఎన్‌సీబీ తీసుకుంది. కాగా, టాలీవుడ్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారన అధికారిగా ఉన్న ఎక్సైజ్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి పలు విషయాలను ఓ మీడియాతో తెలిపారు. 12 కేసుల్లో ఉన్న అందరి శాంపిళ్లను సేకరించినట్లు తెలిపారు. టాలీవుడ్‌తోపాటు వ్యాపారవేత్తల శాంపిళ్లను సైతం పంపించామని అన్నారు. కొంత మంది టాలీవుడ్ నటులు శాంపిళ్లు ఇవ్వడానికి నిరాకరించినట్లు చెప్పారు. శాంపిళ్లు ఇచ్చి పునరావాస కేంద్రంలో కౌన్సిలింగ్ పొందిన వారి పేర్లను ఛార్జ్‌షీట్లో పెట్టలేదన్నారు. కొంత మంది నటులు పునరావాస కేంద్రంలో కౌన్సిలింగ్ తీసుకోలేదు. వారి పేర్లను మాత్రం ఛార్జ్ షీట్లో పొందుపర్చినట్లు చెప్పారు. అయితే ఛార్జ్ షీట్లో పేరు వచ్చిన వారికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
72 మంది శాంపిళ్ల సేకరణ
కాగా, డ్రగ్స్ కేసులో 72 మందికి సంబంధించిన శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో టాలీవుడ్‌కు డ్రగ్స్ చేరుకుంటున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎన్‌సీబీ ఇప్పటికే తీసుకుంది. ఎక్సైజ్ అధికారులతో కలిసి ఈ కేసు ఎన్‌సీబీ ముందుకు వెళ్తోందని ఎక్సైజ్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ అన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న వారందరి స్టేట్‌మెంట్ వీడియో రికార్డు చేశామని, నాలుగు కేసుల్లో సిట్ విచారణ కొనసాగుతోందని అన్నారు.
అటు వెండి తెర నుంచి ఇటు బుల్లితెర వరకు డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు టీవీ నటులను ఎన్‌సీబీ విచారణకు పిలిచింది. అబీగైల్ పాండే, సనమ్‌లను విచారణ రావాలని ఆదేశించారు. కరమ్‌జీత్ అలియాస్ కేజే విచారణలో పలువురి పేర్లు బయటపడినట్లు తెలుస్తోంది. అలాగే ముంబైలో నిర్మాత మధు మంతెన మెడకు డ్రగ్స్ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఏడాది జూన్ 22న జయాతో మధు ఫోన్ సంభాషణ జరిపినట్లు అధికారులు గుర్తించారు. సీబీడీ ఆయిల్‌తో పాటు గంజాయి అడిగినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. అయితే ఎన్‌సీబీ విచారణలో జయాసాహా పలు వివరాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఉదయం మధు మంతెనను కూడా ఎన్‌సీబీ విచారించింది.