భార్య మృతిని తట్టుకోలేక.. ఆమె చితిలో దూకిన భర్త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 5:51 AM GMT
భార్య మృతిని తట్టుకోలేక.. ఆమె చితిలో దూకిన భర్త

తన కష్ట సుఖాల్లో జీవితాంతం తోడు ఉంటానని పెళ్లి నాడు ప్రమాణం చేశాడు ఆ భర్త. వారి పెళ్లి అయి మూడు నెలులు దాటింది. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. ఏమైందో తెలీదు ఆమె బావిలో శవమై కనిపించింది. భార్య మరణాన్ని తట్టుకోలేని ఆ భర్త.. భార్య చితిలో దూకాడు. పక్క నున్న వారు రక్షించారు. ఆ కాసేపటికి భార్యపై ఉన్న ప్రేమతో భార్య ఎక్కడైతే ఆమె తుది శ్వాస విడిచిందో ఆ బావిలోనే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ భర్త. ఈ హృదయ విదారకర ఘటన మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లాలోని భాంగ్రామ్‌ తలోధి గ్రామంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చి 19న కిషోర్ ఖాతిక్ అనే యువ‌కుడికి రుచితా చిట్టావ‌ర్ అనే యువతితో పెళ్లి జరిగింది. పెళ్లి నాటి నుంచి వారిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వారి సంసారానికి తీపి గుర్తుగా రుచితా ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. కాగా.. రుచితా తల్లి అనారోగ్యంతో బాదపడుతోంది. దీంతో తల్లిని చూసేందుకు రుచిత నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. తన అత్తగారికి చూసి, భార్యను ఇంటికి తీసుకురావడానికి కిషోర్‌ ఆదివారం అత్తగారింటికి వెళ్లాడు. కాగా.. కొద్దిసేపటి తరువాత భార్య కనిపించలేదు. ఆమె బయటకు వెళ్లి గంటలు గడుస్తున్నా ఇంటికి తిరిగి రాలేదు.

దీంతో భర్తతో పాటు రుచిత తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రుచిత గురించి వెతుకుతుండగా.. ఊరి చివర ఉన్న బావిలో రుచిత మృతదేహాం ఉందని చెప్పడంతో అక్కడకు పరుగు పరుగున వెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆమె మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు. దీంతో కిషోర్‌తో పాటు రుచిత తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోమవారం రుచిత అంత్యక్రియలు నిర్వహించారు. పెళ్లి జరిగి మూడు నెలలు కూడా కాలేదు. ఇంతలో భార్య తనను విడిచి వెళ్లడాన్ని కిషోర్‌ తట్టుకోలేకపోయాడు. ఆమె చితికి నిప్పుపెట్టిన కాసేపటికే.. నువ్వు లేకుండా ఈ లోకంలో బతకలేను..నీ వెంటే నేను అంటూ ఆ చితిలో దూకేశాడు. వెంటనే అక్కడున్న వారు అతడిని రక్షించారు. భార్య తనతో లేదు అన్న చేదు నిజాన్ని భరించలేని అతడు మరి కాసేపటికే.. రుచిత ఆత్మహత్య చేసుకున్న బావి వద్దకే వెళ్లాడు. తన భార్య ఎక్కడైతే తుది శ్వాస విడిచిందో ఆ బావిలోనే దూకి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రుచిత ఆత్మహత్య చేసుకుందా..? ప్రమాదవశాత్తు బావిలో పడిందా..? ఎవరైనా ఆమెను చంపి బావిలో పడేశారా..? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it