ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరం జరుగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను బుధవారం జరిగే కేబినెట్‌ సమావేశం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ అనంతరం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

అయితే ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ హామి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని అమలు చేయడంపై జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పుడున్న13 జిల్లాలకు అదనంగా మరో 12 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం. కాగా, ముందుగా 12 జిల్లాలు ఏర్పాటు చేయాలని అనుకోగా, మరో రెండు గిరిజన జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వస్తోంది. దీంతో ప్రతిపాదిత జిల్లాల సంఖ్య 27కు చేరినట్లు సమాచారం.

ఈలోగా జనాభా గణన ప్రక్రియ తెరపైకి రావడంతో కేంద్రం ఫ్రీజింగ్‌ ఉత్తర్తవులు జారీ చేసింది. దీని ప్రకారం గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సరిహద్దులు మార్చడం అవకాశం లేదు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు అడ్డంకిగా మారింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేపట్టవచ్చని, ఆ లోగా ఫ్రీజింగ్‌ గడువు కూడా తీరిపోతుందని ఉన్నతాధికారులు రెవెన్యూ శాఖకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాల ఏర్పాటుపై ఉన్నతస్థాయి కమిటీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరి కొత్త జిల్లాలపై ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.