వావ్ అనే నిర్ణయం.. నెల రోజులుగా ఆ ఊళ్లో వెలగని వీధిలైట్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 July 2020 7:32 AM GMT
వావ్ అనే నిర్ణయం.. నెల రోజులుగా ఆ ఊళ్లో వెలగని వీధిలైట్లు

ఒక గ్రామంలో నెల రోజులుగా వీధి లైట్లు వెలగకుంటే.. వావ్ అనటమా? ఇదెక్కడి విచిత్రం అనుకుంటున్నారా? నిజమే.. బతికున్న జంతువుల్నిదారుణంగా హింసించి.. ప్రాణాలు తీసే పాడు కాలంలో.. మనసు.. మానవత్వం లాంటి మాటలు ఎప్పుడో పోయానని భావిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా.. ఒక ఊళ్లోని వారు ఇంత ‘సున్నితం’గా ఆలోచించటమా? అని ఆశ్చర్యపోయే ఉదంతంగా దీన్ని చెప్పాలి.

తమిళనాడులోని శివగంగ జిల్లాలోని పొత్తకూడి గ్రామంలో గడిచిన నలభై రోజులుగా వీధి లైట్లు వెలగటం లేదు. అయినప్పటికీ.. అక్కడి ప్రజలు అసలేం ఫీల్ కావట్లేదు సరికదా.. తాము తీసుకున్న నిర్ణయానికిఅసలు చింతించటం లేదు. ఇంతకీ వీధి లైట్లు ఎందుకువెలగటం లేదో తెలుసా? ఒక చిన్న పక్షి పెట్టిన గుడ్ల కోసం అని తెలిస్తే ఎవరైనా ఆవాక్కు అవ్వాల్సిందే.

ఆ ఉళ్లోకి యాభై రోజుల క్రితం అరుదైన ఇండియన్ రాబిన్ లే పక్షి జంట వచ్చింది. వీధి లైట్లను కంట్రోల్ చేసే స్విచ్ బోర్డును తన గూడుగా మార్చుకొని గుడ్లు పెట్టేసింది. సాయంత్రం అయ్యేసరికి ఆ బోర్డు దగ్గరకు వచ్చి కరుప్పరాజు స్విచ్ ఆన్ చేసేశాడు. తాను స్విచ్ వేసేటప్పుడు.. ఆపేటప్పుడు ఆ పక్షి విపరీతంగా భయపడిపోవటాన్ని గుర్తించాడు. దీంతో.. ఆ విషయాన్ని గ్రామస్తులకు చెప్పటం.. వారంతా సమావేశమై.. ఆ పక్షి పెట్టిన గుడ్లు పొదిగి.. అవి పెద్దవి అయ్యే వరకు వీధి లైట్లు వేయకూడదని తీర్మానించారు.

22

అంతేకాదు.. ఆ స్విచ్ బోర్డు వద్దకు ఎవరూ వెళ్లకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆ గ్రామంలోని వంద ఇళ్ల వద్ద ఉంటే వీధి లైట్లు మొత్తం వెలగని పరిస్థితి. అయినప్పటికీ.. వారు ఏ మాత్రం చింతించటం లేదు. ఇప్పటికి ఆ పక్షి జంట మూడు గుడ్లను పెట్టింది. వాటిని పొదిగింది కూడా. మూడు చిన్న పక్షలు ఆరోగ్యంగా ఉండటంతో గ్రామస్తులు తాము పడిన కష్టానికి సరైన ఫలితం వచ్చిందని సంతోషిస్తున్నారు.

చిన్న పక్షులకు ఇప్పు్డిప్పుడే రెక్కలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో పెరిగి పెద్దవి అవుతాయని.. అవి ఎగిరే వరకూ వీధి లైట్లను వెలిగించమని తేల్చి చెబుతున్నారు గ్రామస్తులు. మరి.. వీధి లైట్లు లేని కారణంగా దొంగలకు అవకాశం లేకుండా ఉండేందుకు.. ఊళ్లోని వారంతా బ్యాచులుగా మారి.. రాత్రిళ్లు పహరా కాయటం గమనార్హం. గ్రామస్తుల సున్నితత్వం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. చిన్న పక్షి కోసం వారు తపిస్తున్న తీరు.. కష్టపడుతున్న వైనాన్ని మనసారా అభినందిస్తున్నారు.

Next Story