సామాన్య భక్తుల సౌలభ్యం కోసం వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఆలయంలో స్వామివారి దర్శనానికి ఉండే స్థలం, సమయం పరిమితంగా ఉండటంతో బయట ఎంత మంచి ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తుల రద్దీ కారణంగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
ఈ నేపథ్యంలో వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులను తీసుకువస్తే దేవస్థానం నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులందరూ భాద్యతతో హుందాగా ఈ సూచనను పాటించాలని తెలియజేశారు.