టీటీడీ ధర్మకర్తల మండలి స‌మావేశంలో పలు కీలక నిర్ణయాలు

TTD takes key decisions. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి నేడు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

By Medi Samrat  Published on  24 Sep 2022 2:00 PM GMT
టీటీడీ ధర్మకర్తల మండలి స‌మావేశంలో పలు కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి నేడు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల తర్వాత టైమ్ స్లాట్ టోకెన్ విధానం ప్రారంభం అవుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం టోకెన్ల జారీ కూడా బ్రహ్మోత్సవాల తర్వాత ఉంటుందని.. ప్రాథమికంగా రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శన టోకెన్ల జారీ ఉంటుందని వెల్లడించింది. తిరుమల వసతి గదుల కేటాయింపు తిరుపతిలోనే చేయాలని భావిస్తోంది. తిరుమలలోని గదుల్లో గీజర్‌ల ఏర్పాటుకు రూ. 7 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేయనున్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో క్లాస్ రూమ్స్, హాస్టల్ అభివృద్ధికి రూ. 6 కోట్లు 20 లక్షల నిధులు కేటాయిస్తారు. 2.45 కోట్ల రూపాయల వ్యయంతో నందకం అతిధి గృహంలో పర్నిచర్ ఏర్పాటు చేస్తారు.నెల్లూరులో కళ్యాణమండపాల వద్ద 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయం నిర్మాణం చేపట్టనున్నారు. క్లాస్ 4 ఉద్యోగులు యూనిఫాం కోసం 2.5 కోట్లు కేటాయించారు. టీటీడీ ఉద్యోగుల ఇంటిస్థలాల కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి 300 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని.. భవిష్యత్తు అవసరాల కోసం రూ.25 కోట్లతో మరో 130 ఎకరాలు కొనుగోలు చేయాలని తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు జరగనున్నాయి. కరోనా సంక్షోభం సద్దుమణిగిన నేపథ్యంలో ఈసారి స్వామివారి వాహన సేవలను భక్తుల నడుమ తిరుమాడ వీధుల్లో నిర్వహించనున్నారు. రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో.. ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు స్వామివారి దర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,158 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 28,416 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
Next Story
Share it