తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయానికి వచ్చే వారిలో ఎక్కువ మంది సామాన్య భక్తులే ఉంటారు. అయితే ఇటీవల అద్దె గదుల ధరలు పెంచారని తిరుమల తిరుపతి దేవస్థానంపై విమర్శలు వస్తున్నాయి. గదుల ధరల పెంపుపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో విమర్శలు, గదుల ధరల పెంపు ఆరోపణలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమల అద్దె గదుల ధరలు పెంచారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాట్లాడం చాలా బాధాకరం అన్నారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచారనే విమర్శలు సరికాదని, సామాన్య భక్తులకు కేటాయించిన గదుల ధరలను పెంచలేదని స్పష్టం చేశారు. భక్తులకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఆరోపణలపై స్పష్టత ఇస్తున్నామన్నారు. తిరుమలలో యాత్రికులకు నాలుగు ఉచిత కాంప్లెక్స్‌లతో పాటు 7500 గదులు ఉన్నాయని తెలిపిన ఈఓ.. రూ.50, రూ.100తో 40 ఏళ్లుగా ఒకే రకమైన అద్దెతో 5 వేల గదులు ఉన్నాయని తెలిపారు. సామాన్య భక్తులకు కేటాయించిన గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు.
1230 గదులకు 1000 రూపాయల అద్దె ఉందని అన్నారు. ఇవన్నీ నాన్ ఏసి గదులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు ఈ గదులను ఆన్ లైన్ కేటాయిస్తామని తెలిపారు. పద్మావతి, ఎంఏబీసీ ఏరియాలోని గదులకు అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, వీఐపీలు ఇష్టపడే సౌకర్యాలు ఎక్కువగా ఉన్నందునే అద్దెలు ఎక్కువగా ఉన్నాయని ఈఓ స్పష్టం చేశారు. 1344 గదులలో నారాయణ గిరి, ఎస్వీ గెస్ట్ హౌస్ అద్దె పెంచామని క్లారిటీ ఇచ్చారు.