తిరుమలలోని అన్నమయ్య మార్గం అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచిన మార్గాన్ని అభివృద్ధి చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మార్గంలో భక్తులు తమ సొంత వాహనాలతో పాటు, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. కాగా ఆదివారం నాడు సుబ్బారెడ్డి.. మామండూరు నుండి తిరుమల పార్వేట మండలం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సమగ్ర నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య మార్గం విషయమై.. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వెంటనే సమగ్ర సర్వే చేయాలని, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని సుబ్బారెడ్డి ఆదేశించారు. అన్నమయ్య మార్గం అభివృద్ధి చెందితే.. హైదరాబాద్, కడప మార్గం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలు కురియడంతో కొండచరియలు విరిగిపడి టీటీడీ రహదారులు దెబ్బతిన్నాయి. రానున్న కాలంలో ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.