తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక సూచనలు చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని, జనవరి 10, 11, 12 తేదీల్లో స్వామివారిని దర్శించుకోవాలని అనుకోకండని అన్నారు. టోకెన్లు తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోకూడదని, 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని, జనవరి 19 లోపు ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని బీఆర్ నాయుడు వివరించారు. వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని, ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు.