మీరు ఎవరితోనైనా పెట్టుకోండి.. బీఆర్‌ నాయుడితో కాదు.. భూమనకు టీటీడీ ఛైర్మన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్

శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్నామ‌ని.. ఈ 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.

By Medi Samrat
Published on : 20 Aug 2025 6:15 PM IST

మీరు ఎవరితోనైనా పెట్టుకోండి.. బీఆర్‌ నాయుడితో కాదు.. భూమనకు టీటీడీ ఛైర్మన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్

శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్నామ‌ని.. ఈ 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. భూమన కరుణాకర్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సాక్షి గజదొంగలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. జగన్‌, భారతిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి వీళ్లంత ఎవరు..? మన హిందూ దేవాలయాలపై దాడి చేయడానికి వీళ్లెవరు.? హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. దమ్ముంటే జగన్‌, భారతిరెడ్డి తిరుమలకు వచ్చి.. గుండు కొట్టించుకుని, నామాలు పెట్టించుకుని మాట్లాడాలని స‌వాల్ విసిరారు. వాళ్లు తిరుమల రారు.. ప్రసాదాలు తినరు.. మనం వాళ్ల జోలికెళ్లడం లేదు.. వాళ్లెందుకొస్తున్నారని ప్ర‌శ్నించారు.

బోర్డు తొలి సమావేశంలోనే టికెట్లపై నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. నాకు ఇచ్చిన వంద టికెట్లను నేను ఏనాడూ వాడలేదు.. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి.. బీఆర్‌ నాయుడితో కాదు అని హెచ్చ‌రించారు. తప్పు చేస్తే చొక్కా పట్టుకుని అడగండి.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేదే లేదన్నారు. టీటీడీ ఛైర్మన్‌, జగన్‌ 2022లో చేసిన పనికి ఇప్పుడు రూ.140 కోట్లు వడ్డీలు కడుతున్నాం.. టీటీడీని అప్పులపాలు, అప్రతిష్టపాలు చేయాలనే కుట్రలు చేశార‌ని ఆరోపించారు.

కరుణాకర్‌రెడ్డి దోపిడీదొంగ.. ఆయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు.. కరుణాకర్‌రెడ్డి చేయని అక్రమాలు లేవు అన్నారు. వీళ్లంతా పెద్ద గజదొంగలు.. త్వరలోనే జైలుకెళ్తారని జోస్యం చెప్పారు. కరుణాకర్‌రెడ్డి, ఆయన కొడుకు చేయని దందాలు లేవు.. నీ హయాంలో ఏం అవినీతి జరిగిందో నేను నిరూపిస్తా.. కరుణాకర్‌రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలని స‌వాల్ విసిరారు. ఒరిజినల్‌ క్రిస్టియన్లు ఎవరూ మన జోలికి రారు.. వీళ్లంతా కన్వర్టెడ్‌ క్రిస్టియన్లు అని అన్నారు.

దేవుడి సేవ చేయడానికి వచ్చాం.. మీలా దోచుకోవడానికి కాదు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తిరగబడతామ‌ని హెచ్చ‌రించారు. తిరుమలలో మెరుగైన సేవల కోసం..భక్తుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం.. భక్తుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామ‌ని తెలిపారు. టికెట్లు అమ్ముకున్న వాళ్లు కూడా మాపై ఆరోపణలు చేస్తున్నారు.. గోవులను చంపించింది భూమన మేనమామ హరినాథ్ రెడ్డే కదా.. తొక్కిసలాటకు కారణం కూడా భూమన అనుచరుడే అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వీళ్లు రోజుకు ఎన్ని టికెట్లు అమ్ముకున్నారో అన్ని ఆధారాలున్నాయి. కరుణాకర్‌రెడ్డి చరిత్ర అంతా రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. భూమనపై గతంలో చాలా కేసులున్నాయి.. అవన్నీ తిరగదోడాలన్నారు. ప్రతి నిర్ణయం పాలకమండలిలో చర్చించే తీసుకుంటున్నాం.. టీటీడీలో అన్యమతస్తులను కచ్చితంగా తొలగిస్తామ‌న్నారు.

Next Story