వీఐపీ బ్రేక్ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కాగా శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇప్పటికే రద్దు చేయబడ్డాయి. శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్థం అదనపు దర్శన టిక్కెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. సర్వదర్శనం భక్తుల కోసం 30,000 టిక్కెట్లు జారీ చేయబడుతున్నాయి. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో శ్రీవారి దర్శన సమయాన్ని రోజుకు అదనంగా రెండు గంటలు పెంచారు. దీని ద్వారా ఎక్కువ మంది సాధారణ భక్తులు దర్శనం పొందవచ్చు.
మరోవైపు ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13 వేల టోకెన్లతో ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం టోకెన్ల అదనపు కోటాను విడుదల చేసిన టీటీడీ, సర్వదర్శనం కోసం రోజుకు 5000 ఆఫ్‌లైన్ టిక్కెట్లను విడుదల చేసి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్‌తో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయంలో కౌంటర్లు ఏర్పాటు చేసింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నారు. ఇక స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.